మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. వేములవాడ రాజన్న ఆలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన
శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కోడె మొక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకునే కోడెలను ఆలయ అధికారులు..

Konda Surekha
Konda Surekha: మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. కొండా సురేఖ సిఫార్సుతో వేములవాడ రాజన్న ఆలయం కోడెలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నాడని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీసుకొండకు చెందిన కాంగ్రెస్ నేత రాంబాబుకు కోడెలను ఇవ్వాలని మంత్రి లేఖలో సిఫారసు చేశారు. అయితే, ఆ లేఖపై విచారణ చేయకుండానే రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో 60 కోడెలను అప్పగించారు. అయితే, అందులో 49 కోడెలు విక్రయించడం వివాదానికి దారితీసింది.
Also Read: KCR: గులాబీ దళపతి రాకకు సమయం ఆసన్నమైందా?
ఈ ఏడాది ఆగస్టు నెలలో మంత్రి కొండా సురేఖ లేఖతో 60 కోడెలను వరంగల్ గీసుకొండకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాంబాబు తన గోశాలకు తీసుకెళ్లాడు. అయితే, 60 కోడెలకుగాను 49 కోడెలను బయట విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా 49 కోడెలను విక్రయించినట్లు రాంబాబు వెల్లడించాడు. విక్రయించిన 49 కోడెల జాడ తెలియట్లేదని వీహెచ్ పీ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించిన ఈవో వినోద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు వేములవాడ రాజన్న ఆలయం ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కోడె మొక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకునే కోడెలను ఆలయ అధికారులు వివిధ గో సంరక్షణ సొసైటీలకు, గోశాలలకు అప్పగిస్తారు.