అసైన్డ్ భూముల్లో సాగుదారులకు గుడ్ న్యూస్.. అలాంటి వారందరికీ హక్కులు కల్పిస్తామన్న మంత్రి పొంగులేటి
జూన్ 2వ తేదీ నాటికి ఈ నాలుగు మండలాల్లోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.

Ponguleti Srinivas Reddy
Minister Ponguleti: అసైన్డ్ భూముల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్య న్యూస్ చెప్పారు. భూభారతి చట్టం పైలెట్ ప్రాజెక్టును నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఖాజీపూర్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు.
ధరణి ఉన్నప్పుడు ప్రజలే అధికారుల చుట్టూ తిరిగారని, కానీ, భూభారతి చట్టంతో అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకొని నిర్ణీత కాల వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తారని, ఎలాంటి ఫీజుకూడా తీసుకోరని చెప్పారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో భూభారతిని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. జూన్ 2వ తేదీ నాటికి ఈ నాలుగు మండలాల్లోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. మిగిలిన 28 జిల్లాల్లోని 28 మండలాల్లోనూ మే 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.
అసైన్డ్ భూములను సాగు చేస్తున్న రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న పేదల్లో అర్హులైన రైతులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ నేతలు కబ్జాపెట్టిన ప్రభుత్వ, రైతుల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వాటిని అసలైన యాజమానులకు అప్పగిస్తామని అన్నారు. కోర్టు వివాదాలు మినహా మిగతా భూ సమస్యలన్నీ భూభారతితో పరిష్కరిస్తామని చెప్పారు.