Raja Singh : మీకో రూల్…మాకో రూలా? ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
నాంపల్లి ఎగ్జిబిషన్ కు లేని కోవిడ్ నిబంధనలు దీక్షకు ఎందుకు? అని రాజాసింగ్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సభలు, సమావేశాలు పెడితే వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నారన్న రాజాసింగ్..

Raja Singh
Raja Singh : కరీంనగర్ లో పోలీసుల తీరును బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఖండించారు. తన కార్యాలయంలో దీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం సరికాదన్నారు. తాను కరీంనగర్ వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని రాజాసింగ్ చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కు లేని కోవిడ్ నిబంధనలు దీక్షకు ఎందుకు? అని రాజాసింగ్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సభలు, సమావేశాలు పెడితే వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నారన్న రాజాసింగ్.. వారికి ఒక రూల్, మాకు మరొక రూలా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని రాజాసింగ్ అన్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జన జాగరణ దీక్ష తలపెట్టారు. రేపు ఉదయం 5 గంటల వరకూ నిద్రపోకుండా జాగరణ దీక్ష చేపట్టారు సంజయ్. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జన జాగరణ దీక్షకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
Covid Restrictions : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు మూసివేత..
ఎంపీ బండి సంజయ్ పోలీసుల కళ్లు గప్పి బైక్ పై ఎంపీ క్యాంపు కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఆయన కార్యాలయంలోకి వెళ్లారు.
పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని బండి సంజయ్ ఖండించారు. నల్గొండలో సీఎం కేసీఆర్ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. బండి సంజయ్ కార్యాలయం లోపల దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్ జాగరణ దీక్షకు ఎలాంటి అనుమతి కోరలేదని కరీంనగర్ సీపీ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనందున మీడియా కవరేజ్ ఇవ్వొద్దని సీపీ కోరారు.
WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం
సంజయ్ జాగరణ దీక్షతో కరీంనగర్‌లో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ క్యాంపు కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ దీక్ష కొనసాగిస్తున్నారు.