kalvakuntla Kavitha : నన్ను ఘోరంగా అవమానించారు.. శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత
kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టారు.
kalvakuntla Kavitha
kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. తనకు ఎదురైన అనుభవాలను శాసనమండలిలో తెలుపుతూ ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.
నాలుగు కోట్ల మంది ప్రజలకు 40మంది ఎమ్మెల్సీలు ఉంటారు. అవకాశం దక్కినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. 20ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిని నేను. 2006 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మన బతుకమ్మ మన గౌరవంను చాటిచెప్పే విధంగా ఊరూరా తిరిగామని, మన భాషను యాషను కాపాడుకునే విధంగా పోరాటాలు చేశామని కవిత అన్నారు.
2004లో అమెరికాలో ఉద్యోగాలు చేశాను. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఇతర దేశాల్లో ఉన్న రాష్ట్రానికి యువత రావటం జరిగింది. ఆ సమయంలో నేను కూడా ఉద్యమం కోసం వచ్చానని కవిత అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం 2013లో కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి గల అంశాలపైన ఢిల్లీకి ఆహ్వానించారు. 2013 ఆగస్టు నుంచి మొదలు పెడితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కవిత గుర్తు చేశారు.
ఉద్యమంలోకి వచ్చే ముందు నా కుటుంబం, నా భర్తతో పూర్తిగా చర్చించిన తరువాత మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని కవిత అన్నారు. జాతీయ పార్టీ మీద ఆధారపడకుండా 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకోసం మాత్రమే పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చిన నిర్వహించానంటూ కవిత తెలిపారు.
తెలంగాణ వచ్చిన మొదటి బతుకమ్మ పండుగ నుంచే నాపై ఆంక్షలు పెట్టారు. నాపై కక్షకట్టి పార్టీ నుంచి బయటకు పంపించేశారని కవిత అన్నారు. నన్ను ఏమీ అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కవిత భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ పై కక్షతో జైల్లో కూడా పెట్టారు. అయినప్పటికీ ఏనాడూ నా పార్టీ నాకు అండగా నిలబడలేదు. మూడు సంవత్సరాలు ఒక్కదాన్నే ఈడీ, సీబీఐతో అనేక అంశాలతో కొట్లాడానని కవిత అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత.. ఆ పార్టీ ద్వారా తనకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకొని ఉండటం నైతికత కాదు.. అందుకే పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని కవిత అన్నారు. నా రాజీనామాను ఆమోదించాలని కవిత కోరారు.
