తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

Updated On : August 22, 2024 / 5:53 PM IST

Mlc Kavitha Sick : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తీహార్ జైలు డాక్టర్ల సూచనతో అధికారులు కవితను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గైనిక్ సమస్యలు సహా తీవ్ర జ్వరంతో కవిత బాధపడుతున్నారు. దాంతో ఢిల్లీ ఎయిమ్స్ కు కవితను తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్, సీబీఐ కేసుల్లో కవిత అరెస్ట్ అయ్యారు. 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం కవిత న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల ఎండల తీవ్రత, అనారోగ్య సమస్యల కారణంగా కవిత తరుచూ అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి ఉంది. జూలై నెలలో కూడా కవితకు దీన్ దయాళ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా కళ్లు తిరిగి పడిపోవడంతో కవితను దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు చికిత్స అందించారు. కవితకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆమె న్యాయవాదులు ట్రయల్ కోర్టును కోరడంతో వైద్య సాయం నిమిత్తం ఎయిమ్స్ లో పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తాజాగా మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు చేశారు. ట్రయల్ కోర్టులో ఈడీ, సీబీఐ ఛార్జ్ షీట్లపై విచారణ సాగుతోంది. అలాగే సుప్రీంకోర్టులో ఆగస్టు 27వ తేదీన కవిత బెయిల్ పిటీషన్లపై విచారణ జరగబోతోంది. త్వరలోనే కవిత బయటకు వస్తారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..