కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్..
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..

MLC Kavitha
MLC Kavitha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సోమవారం జగిత్యాలలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ఇచ్చింది. మిగిలిన 40శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం స్పస్టంగా చెప్పాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కవిత విమర్శించారు.
హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామన్న ఉద్దేశంతో మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ను విచారణ చేశారు.. ఈరోజు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. మేము ప్రభుత్వం పెట్టే వేధింపులకు భయపడేవాళ్లం కాదని అన్నారు.
కేటీఆర్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమైన చర్య. మా కార్యకర్తలు, నాయకులను బయటకు రానివ్వకుండా అడ్డుకోవటం దారుణం అని కవిత అన్నారు. మా పార్టీలోని లోపాలను సవరించుకుంటాం. అదే సమయంలో మాపై ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని కవిత చెప్పారు.