MLC Kavitha : కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి, పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి- కవిత సంచలన వ్యాఖ్యలు..
పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉంది.

MLC Kavitha: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో వేడి పుట్టించారు. దేవుడు, దెయ్యాలు అంటూ పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరలేపారు కవిత. కేసీఆర్ దేవుడు అన్న కవిత.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ బాంబు పేల్చారు. కేసీఆర్ కు రాసిన లేఖపైనా కవిత స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
”రెండు వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాశా. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపా. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే చెప్పా. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు, నాకు పర్సనల్ అజెండా లేదు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ చుట్టూ ఉన్న వారి వల్లే నష్టం జరుగుతోంది.
అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది? అంతర్గత లేఖను ఎవరో బయటపెట్టారు. నేను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే పార్టీలో ఉన్న ఇతరుల పరిస్థితి ఏంటి? పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణను మోసం చేశాయి, నాశనం చేశాయి. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందని, కేసీఆర్ ఆగమవుతున్నారని కాంగ్రెస్ సంబరపడుతోంది.” అని కవిత అన్నారు.
ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి నేతలు, అభిమానులు. జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాలేదు. ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించలేదు.
తన రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాలని జాగృతి కార్యకర్తలకు సందేశం పంపారు కవిత. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ జనసమీకరణకు ప్లాన్ చేశారామె. మరోవైపు కవిత లేఖపై బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధానికి దిగాయి. కవిత లేఖ డ్రామా అని బీజేపీ అంటుండగా.. బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.