కులగణనపై కేంద్రం నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నఎంపీ లక్ష్మణ్.. కాంగ్రెస్ నేతలపై ఫైర్
కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

BJP MP Laxman
BJP MP K. Lakshman: మంత్రివర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనగణనతో పాటు, కుల గణన చేపడతామని ప్రకటించడం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మోదీ చేపట్టే కుల గణన దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ యావత్ దేశం మోదీని అభినవ అంబేద్కర్ అంటూ కొనియాడుతున్నారని అన్నారు.
కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కొత్త.. రేవంత్ లో కాంగ్రెస్ డీఎన్ఏ లేదు. కాంగ్రెస్ ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది.. మరి 60ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కుల గణన ఎందుకు చేపట్టలేక పోయిందంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు. మండలి కమిషన్ సిఫార్సులు చెత్తబుట్టలో వేసిన చరిత్ర నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలది అంటూ విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు ఓబీసీలకు కాంగ్రెస్ విరోధిగానే ఉంది. కాంగ్రెస్ పాలనంతా బీసీలను అణిచివేసిన చరిత్రే అంటూ లక్ష్మణ్ విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల కుల గణన సర్వే రిపోర్టు బయటపెట్టలేదు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఎట్లా అవుతుంది..? తెలంగాణ రోల్ మోడల్ అయితే రాష్ట్రంలో కులగణన రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో 12 శాతం ఉన్న ముస్లిలలో 10శాతం ఓబీసీ ముస్లిలు ఉన్నారని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. కుల గణనపై 2018లోనే రాజ్ నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు. కుల గణన రాహుల్ గాంధీ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో చేయడం లేదు. మోదీ నేతృత్వంలో లీగల్ గా, నీతి వంతంగా, న్యాయంగా కులగణన జరుగుతుందని లక్ష్మణ పేర్కొన్నారు.
కోర్టులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కులగణన చేస్తాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా లెక్కలు ఉంటాయి. కాంగ్రెస్ అశాస్త్రీయంగా సర్వే చేసింది. కానీ, మేము శాస్త్రీయంగా లెక్కలు చేస్తాం అని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి.. నరేంద్ర మోదీకి పరిపాలనా అనుభం ఉంది. ఆయనకు కుల గణన ఎలా చేయాలో తెలుసు.. కాంగ్రెస్ కుల గణన చేస్తే కోర్టులు చివాట్లు పెట్టాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కాంగ్రెస్ నేతలకు లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు.