Telangana Congress: కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్.. రాహుల్ ప్రసంగంలో ఆ విషయంపై క్లారిటీ

జనగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది. ఇన్నాళ్లు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అంటూ బీజేపీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ విషయంపై రాహుల్ స్పష్టమైన ప్రకటన చేశారు.

Telangana Congress: కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్.. రాహుల్ ప్రసంగంలో ఆ విషయంపై క్లారిటీ

Rahul Gandhi Jana Garjana Sabha

Updated On : July 3, 2023 / 10:53 AM IST

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Congress Party) శ్రేణుల్లో ఖమ్మం జనగర్జన సభ (Janagarjana Sabha) నయా జోష్‌ను నింపింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఊహించినట్లుగానే భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనగర్జన సభ విజయవంతం కావడం ఆ పార్టీలో మరింత ఊపును తెచ్చినట్లయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్ కూడా  ఒక్కసారిగా పెరిగింది. దీనికితోడు కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతారాగం ఆపార్టీ శ్రేణులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చినట్లయింది. తాజాగా జనగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆ పార్టీ నేతల్లో మరింత ఊపును తీసుకొచ్చింది.

Rahul Gandhi : రాహుల్‌తో ఏపీ లీడర్స్ భేటీ.. త్వరలో అమరావతికి ప్రియాంక

జనగర్జన సభలో రాహుల్ గాంధీ తనదైన శైలిలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేశారు. సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో తాను పాల్గొంటున్న ఒక్కో సభలో ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జనగర్జన సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ గ్యారంటీ స్కీం ‘చేయూత’ ద్వారా ప్రతినెల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పలు వర్గాల వారికి రూ. 4,000 పెన్షన్ అందిస్తామని రాహుల్ ప్రకటించారు. జనగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగం బీఆర్ఎస్ టార్గెట్ గా సాగింది. బీఆర్ఎస్‌ను బీజేపీ బంధువుల పార్టీగా రాహుల్ గాంధీ పోల్చారు. తద్వారా బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అంటూ ప్రజలకు రాహుల్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయని, తెలంగాణ నుంచి బీఆర్ఎస్‌ను సాగనంపుతామని రాహుల్ అన్నారు. కొద్దికాలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో జనగర్జన సభ ద్వారా.. బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదంటూ రాహుల్ స్పష్టం చేశారు.

Rahul Gandhi: తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నా.. ఇంకా..: రాహుల్‌ హామీలు

బీహార్‌‌లో నిర్వహించిన విపక్షాల మీటింగ్‌కుసైతం బీఆర్ఎస్ పార్టీ పాల్గొంటే కాంగ్రెస్ దూరంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చామని రాహుల్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి మోదీకి తెలుసు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మధ్యే పోటీ ఉంటుందని రాహుల్ చెప్పారు. రాహుల్ గాంధీ ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు బీజేపీ విమర్శలు చేస్తున్నట్లు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయన్న ప్రచారం జరిగింది. ఈ విషయంపై రాహుల్ స్పష్టమైన ప్రకటన చేశారు.