ఢిల్లీ లిక్కర్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. కవిత బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించారు జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ కవితకు బెయిల్ నిరాకరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు.

3 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత..
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై మే 27, 28 రెండు రోజులపాటు విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్ట్. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు. దర్యాఫ్తు సంస్థలు ఈడీ, సీబీఐ కవితకు బెయిల్ వ్యతిరేకించాయి. లిక్కర్ కేసులో కవితను కింగ్ పిన్ గా పేర్కొన్నాయి దర్యాప్తు సంస్థలు. నిబంధనల ప్రకారం, చట్టబద్ధంగానే కవితను అరెస్ట్ చేశామని వెల్లడించాయి. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని, ప్రధాన లబ్ధిదారు అని పేర్కొన్నాయి.

కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించాయి ఈడీ, సీబీఐ. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని దర్యాప్తు సంస్థలు వాదనలు వినిపించాయి. కవిత నేరం చేశారు అనడానికి వాట్సప్ చాట్స్, అప్రూవర్లుగా మారిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తమ వద్ద ఉన్నాయని ఈడీ, సీబీఐ తెలిపాయి. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని.. సాక్షులు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెబుతూ కవితకు బెయిల్ వ్యతిరేకించాయి దర్యాప్తు సంస్థలు.

కవిత అరెస్ట్ చట్ట విరుద్దంగా జరిగిందని, ఆధారాలు లేవని, రాజకీయ కోణంలో అరెస్ట్ జరిగిందని, మహిళగా, ప్రజాప్రతినిధిగా ఉన్నందున బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది వాదనలను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

Also Read : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత