మోదీ మన్‌కీ బాత్‌లో సంగారెడ్డి మహిళల గురించి ప్రస్తావన.. వాళ్లు ‘స్కై వారియర్స్’ అంటూ ప్రశంస..
తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు.

Modi mann ki baat: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆదివారం ప్రధాని మోడీ తొలి మన్‌కీ బాత్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, ప్రతిఒక్కరూ దేశ భక్తి భావాలతో నిండి ఉన్నారని మోదీ అభినందించారు. ప్రతి భారతీయుడి సంకల్పం.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు కచ్చితత్వంతో ధ్వంసం చేయడం అసాధారణమైనది. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక లక్ష్యం కాదు.. ఇది మన సంకల్పం, ధైర్యం, పరివర్తన చెందుతున్న భారతదేశానికి ప్రతిబింబం అని ప్రధానమంత్రి అన్నారు.
తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి మాట్లాడుతూ.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గురించి మోదీ ప్రస్తావించారు. వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడాన్ని ప్రశంసించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొంది.. పండ్ల తోటలపై పురుగుల మందులు ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. వాళ్లు డ్రోన్ ఆపరేటర్లు కాదు.. ‘స్కై వారియర్స్’ అని మోదీ అభివర్ణించారు.
మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. వ్యవసాయంలోనూ అధునాతన పద్దతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా డ్రోన్ల వాడకం కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పేరిట పథకాన్ని చేపట్టింది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు డ్రోన్ ఆపరేటింగ్‌పై శిక్షణ ఇచ్చి ఆదాయం లభించేలా చేయడం, వ్యవసాయంలో సాంకేతికత, యాంత్రీకరణ ద్వారా పని భారాన్ని, పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే ఈ పథకం ఉద్దేశం.
రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హెటిరో గ్రూప్ సౌజన్యంతో మహిళలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. జోగిపేటలోని మహిళా సమాఖ్య భవనంలో తొమ్మిది రోజులపాటు డ్రోన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఫ్లయింగ్ వెడ్జ్ (డ్రోన్ ఆపరేటింగ్), సింక్రో (టెక్నికల్ సపోర్ట్) అనే రెండు సంస్థల సహకారంతో హెటిరో డ్రగ్స్ పరిశ్రమ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 10 మండలాలకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు.
‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద శిక్షణ పొందిన మహిళలకు డ్రోన్ కొనుగోలు చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రూ.10 లక్షల విలువైన డ్రోన్‌ను బ్యాంకు రుణం ద్వారా కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ.. అందులో 80 శాతం సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి. మిగిలిన రూ.2 లక్షల రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో డ్రోన్ ద్వారా ఒకరు ఆపరేటర్‌గా, మరొకరు సహాయకురాలిగా వ్యవహరిస్తూ ఇద్దరు మహిళలు ఉపాధి పొందే వీలుంటుంది. డ్రోన్లతో పండ్ల తోటలు, కూరగాయల సాగు, పత్తి, లాంటి పంటలకూ మందులు పిచికారీ చేయడం, ద్రవరూపంలోని ఎరువులు వేయవచ్చు.