సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు..! అన్నదమ్ముళ్ల దొంగాట.. అరెస్టు చేసిన పోలీసులు
ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

criminal
Telangana: ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్లలో ప్లంబర్ గా పనిచేస్తూ ఒకరు దొంగతనాలు చేయగా.. ఆ సొమ్మును మరొకరు అమ్మేవారు. వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ వాటాలు వేసుకొని తీసుకొనేవారు. అయితే, వీరిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
షాహీన్ నగర్ కు చెందిన హాబీబ్ మహ్మద్ (37), మొఘల్ పురాకు చెందిన హబీబ్ అలీ (49) ఇద్దరూ అన్నదమ్ముళ్లు. హబీబ్ మహ్మద్ ఇండ్లలో ప్లంబర్ గా పనులు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇలా హబీబ్ దాదాపు 59 దొంగతనాలు చేశాడు. జైలుకుసైతం వెళ్లొచ్చాడు. పలు కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోవటంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది.
Also Read: పాస్టర్ ప్రవీణ్ కేసు.. కీలకమైన పోస్టుమార్టం రిపోర్ట్.. అనుమానాస్పద సీసీ పుటేజ్ లభ్యం
ఇటీవల సైబరాబాద్ లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 145గ్రాముల బంగారం దోచుకెళ్లారు. పాతనేరస్తుడు హబీబ్ మహ్మద్ పై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. సొమ్మును ఏం చేశావని పోలీసులు విచారించగా.. దొంగతనం చేసిన సొమ్ములో సగభాగం తన అన్న హబీబ్ అలీకి ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో హబీబ్ అలీని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హబీబ్ మహ్మద్ దొంగతనం చేస్తుండగా.. ఆ నగలను హబీబ్ అలీ విక్రయించేవాడని పోలీసులు గుర్తించారు. వారిద్దరిని అరెస్టు చేసి.. నిందితుల నుంచి 145 గ్రాముల బంగారం, మూడు మొబైల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.