BRS Silver Jubilee Meet : హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి..
సభకు పోలీసుల అనుమతి రావడంతో హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ విత్ డ్రా చేసుకోనుంది.

BRS Silver Jubilee Meet : హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి లభించింది. ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించబోతోంది. 1250 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సభకు పోలీసుల అనుమతి రావడంతో హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ విత్ డ్రా చేసుకోనుంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనుమతి వివాదానికి తెరపడింది. సభ నిర్వహణకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ బృందం పెట్టిన దరఖాస్తులు స్వీకరించారు పోలీసులు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ పోలీస్ కమిషనరేట్. పోలీస్ పర్మిషన్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సభకు పోలీసుల నుంచి అనుమతి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : రాజాసింగ్‌తో భేటీ తర్వాత బండి సంజయ్ కామెంట్స్.. బీజేపీలో విబేధాలపై..
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి విషయంలో ఆ పార్టీ అధిష్టానం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే తమ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. రెండుసార్లు విన్నవించినా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించింది. 21వ తేదీలోపు ఈ వివాదానికి తెరదించాలని కోర్టు చెప్పిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ సభకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. 27వ తేదీన బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహించనుంది.