నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు.. ప్రభుత్వం సీరియస్, అధికారి సస్పెండ్

ర్యాపిడో బైక్ పై దరఖాస్తులు తరలిస్తుండగా అవి కిందపడిపోయాయి. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను చూసి అంతా షాక్ కి గురయ్యారు.

నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు.. ప్రభుత్వం సీరియస్, అధికారి సస్పెండ్

Praja Palana Application Forms

Updated On : January 9, 2024 / 10:28 PM IST

Praja Palana Application Forms : ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వాల్యుయేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఎస్ మహేందర్ ను జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. వార్డు నెంబర్ 13కు మహేందర్ టీమ్ లీడ్ గా పని చేశారు. దరఖాస్తుల ట్రాన్స్ పోర్ట్ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ర్యాపిడో బైక్ పై అభయహస్తం దరఖాస్తులు తరలిస్తుండగా అవి కిందపడిపోయాయి. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. దీనిపై విచారణకు అదేశించిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

Also Read : టార్గెట్ 12.. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

అధికారులకు అందించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై ప్రత్యక్షం కావడం షాక్ కి గురి చేసింది. ర్యాపిడో బైక్ పై తరలిస్తుండగా.. దరఖాస్తులు ఎగిరి పడ్డాయి. రోడ్డుపై పడ్డ దరఖాస్తులను చూసి స్థానికులు విస్తుపోయారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి వై జంక్షన్‌ వైపు నుంచి వస్తున్న ఓ బైక్‌పై నుంచి ప్రజాపాలన దరఖాస్తులు ఎగిరి.. బాలానగర్‌ వంతెనపై చిందరవందరగా పడ్డాయని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారుడు తన బైక్‌ను పక్కకు నిలిపి కిందపడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు. ఎవరో ర్యాపిడోలో బుక్‌ చేస్తే.. తాను తీసుకొని వెళ్తుండగా అట్టపెట్టె చిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని ఆ వ్యక్తి వివరించాడు. అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉండగా.. వాటిపై హయత్‌నగర్‌ సర్కిల్‌ పేరు రాసి ఉందని స్థానికులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజాపాలన పేరుతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్ల వివరాలను అధికారులు ఆన్‌లైన్ లో ఎక్కించే పనిలో పడ్డారు. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వ అధికారులు అప్లికేషన్లను ఆన్‌లైన్ లో ఎంట్రీ చేయడానికి ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పజెబుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి.

Also Read : ప్లాట్‌ఫాం టికెట్‌పై శుభవార్త.. 115 స్పెషల్ రైళ్లలో మాత్రం అదనపు చార్జీలు

దీనికి తోడు ర్యాపిడో ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా.. అవి బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఆందోళనకు గురి చేస్తోందని ప్రజలు వాపోతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలు అమలుకు సంబంధించి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి ప్రజలు అర్జీల రూపంలో పెట్టుకున్న అప్లికేషన్లు, ప్రజాపాలనలో ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులు ఇలా ఫ్లైఓవర్‌పై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రోడ్డుపై పడిపోయిన పేపర్లు ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు అని తెలిసి అంతా షాక్ కి గురయ్యారు. ప్రజల దరఖాస్తుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని మండిపడుతున్నారు. అసలు ర్యాపిడీ బైక్ పై తీసుకెళ్లడం ఏంటి? ప్రభుత్వ వాహనాల్లో కదా తీసుకెళ్లాలి? అని జనాలు అడుగుతున్నారు.