Ticket Charges: వామ్మో.. హైదరాబాద్ టు వైజాగ్.. బస్ టికెట్ ధర రూ.3వేల 600.. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..
సాధారణ రోజుల్లో ఉండే ధరలకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నా రవాణ శాఖ అధికారులు నియంత్రించలేకపోతున్నారు.

Ticket Charges: దసరా పండగ వేళ దూర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచి ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నారు. దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండగల సమయంలో ఇలా ప్రతి ఏడాది టికెట్ల రేట్లు పెంచుతూ ఉంటారు. పండగ రోజులో ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నా రవాణ శాఖ అధికారులు నియంత్రించలేకపోతున్నారు.
విజయవాడ, వైజాగ్, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రెండు నెలల క్రితమే నిండిపోయాయి. ఇక ఈ పండగ వేళలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నా డిమాండ్ దృష్ట్యా దీన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహాకులు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను ముందుగానే ప్రదర్శిస్తారు. దీనికి భిన్నంగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు టికెట్ ధరలను పెంచేస్తున్నాయి.
సాధారణ రోజుల్లో ఉండే ధరలకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే స్లీపర్ బస్సులో 3వేల 200 నుంచి 3వేల 600 వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలు 2వేల నుంచి రూ.2,700 గా ఉన్నాయి. ఇక కుటుంబంలో నలుగురికి బస్సులో రానుపోను 20వేల రూపాయల పైనే ఖర్చు అవుతుంది.
హైదరాబాద్ నగరం నుంచి కడపకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ ధర 600 ఉంటుంది. పండగ వేళ ఆ ధరను దాదాపుగా రెట్టింపు చేశారు. దసరాకు రెండు రోజుల ముందు సొంతూళ్లకు వెళ్లే వాళ్లు మూడు రెట్ల ఎక్కువ ధర చెల్లించాల్సిందే. ఇక పండగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది. రైళ్లు, ఆర్టీసీ బస్సులు త్వరగా నిండిపోవడం, ప్రయాణికులకు సరిపడా సర్వీసులు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ కు అవకాశం మారింది. పండగ వేళ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలపై 50శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
Also Read: మందుబాబులు, నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పండక్కి ముక్క, చుక్క బంద్