wills registration : కరోనా కాలంలో పెరుగుతున్న వీలునామాల రిజిస్ట్రేషన్

కరోనా కాలంలో మనజీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆహారం,మాస్కులు,శానిటేజర్లు జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు ఆస్తుల విషయంలో ముందు జాగ్రత్తగా వీలునామాలు రాసే మార్పు కూడా వచ్చేసింది.

wills registration : కరోనా కాలంలో పెరుగుతున్న వీలునామాల రిజిస్ట్రేషన్

Last Will

Updated On : August 25, 2021 / 4:47 PM IST

doing last will in below 40 years age : కరోనా కాలంలో వీలునామాలు రాసేవారు పెరుగుతున్నారట.కరోనాకు వీలునామాకు సంబంధం ఏంటీ అంటే..ముందస్తు జాగ్రత్తలు అంటున్నారు జనాలు. ఏమో కరోనా రావచ్చు..చనిపోవచ్చు. మరి అప్పుడు వారి ఆస్తి ఎవరికి చెందుతుంది? ఆ ఆస్తి కోసం వారసులు గొడవలు పడే అవకాశం ఉంది కదా..అందుకే ఈ ముందస్తు జాగ్రతలట. అందుకే ఈ కరోనా కాలంలో వీలునామాలు రాసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేవారి సంఖ్య పెరిగిందట. కరోనాకాలంలో ఇదొక వింత పరిస్థితి.

అలా కరోనా వచ్చి సడెన్ గా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వారసులు ఆస్తుల కోసం బ్యాంకులో ఉన్న డబ్బు కోసం గొడవలు పడి కొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాకాకుండా సామరస్యంగా పంచుకుందామనుకునేవారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటిదే జరిగింది హైదరాబాద్‌లోని తార్నాక ప్రాంతానికి చెందిన ఓవ్యక్తి కరోనా మరణం తరువాత. ఇటీవల కరోనాతో సదరు వ్యక్తి మరణించగా..ఆయన పేరుతో బ్యాంకు ఖాతాలో రూ.3 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు ఇతర స్థిర, చరాస్తులు ఉన్నాయి.

ఆయన ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఆస్తులు పంచుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ.. ఆఫీసుల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. దీంతో తోబుట్టువుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితులను చూసిన మృతుడి సోదరుడు తను కూడా ఏదైనా కారణాలతో చనిపోతే నా పిల్లలు కూడా ఇలాగే ఇబ్బందులు పడతారేమో..లేదా గొడవలు పడేస్థాయికి చేరుకుంటారేననమో ఆందోళనతో ఆయన ముందు జాగ్రత్తగా వీలునామా రాసి రిజిస్టర్‌ చేయించారు.

కరోనా కారణంగా రాబోయే పరిస్థితులను ఎవరూ ఊహించలేకపోతున్నారు. దీంతో తమ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ముందుగానే వీలునామాలు రాస్తున్నారు. కరోనా మొదటివేవ్‌ సమయంలోనే ఈ పరిణామం మొదలైనా.. సెకండ్‌వేవ్‌ తీవ్రతరం కావటంతో మృతుల సంఖ్య కూడా పెరగటం వంటికారణాలు ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

ఆరోగ్యంగా ఉండేవారు కూడా పలు కారణాలతో సడెన్ గా చనిపోతే..ఎలా?అనే ప్రశ్న చాలామందిలో వస్తోంది. దీంతో ఇలా ముందస్తు జాగ్రత్తగా వీలునామాలు రాసేవారి సంఖ్య పెరుగుతోంది.
ఒక వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆస్తుల పంపకాల విషయంలో వారసులు నానా అవస్థలు పడుతుండటం గమనిస్తున్న క్రమంలో ముందస్తుగా వీలునామాలు రాసేస్తున్నారు. కేవలం 40 ఏళ్లు ఉన్నవారు కూడా వీలునామాలు రాయటం ఈ కరోనా కాలపు పరిస్థితులను నిదర్శనమని చెప్పవచ్చు. అలా తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్ళుగా ఏటా 5 వేల వీలునామాలు రిజిస్టర్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా కాలంలో ఈ సంఖ్య మరింతగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత వీలునామాలు రాసే వారి సంఖ్య 15-20 శాతం వరకు పెరిగిందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెప్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ-వీలునామాలు రాసేవారి సంఖ్య 76 శాతం పెరిగిందని చెబుతున్నారు.వీలునామా సంబంధ సేవలు అందించే ‘విల్‌జీనీ’ పోర్టల్‌కు గతేడాది ఏకంగా 58 వేల మంది ఫోన్‌ చేసి వివరాలు అడిగారట. 2019తో పోల్చితే ఇది 400 శాతం అధికమని తేలింది. 2021లో కూడా ఇదే కొనసాగుతోంది.ఆన్‌లైన్‌ వీలునామా సర్వీసులు అందించే పోర్టళ్లకు రెండేండ్లలో 200-300 శాతం డిమాండ్‌ పెరిగిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో 55 ఏండ్లకు పైబడినవారు వీలునామాలు రాసేవారు. కరోనా తర్వాత 40ఏళ్లవారు కూడా వీలునామాలు రాస్తున్నారు. ఆరోగ్యవంతులను సైతం కరోనా కబళిస్తుండటంతో ఇటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్‌ ఉద్యోగులు వీలునామాలు రాసేవారిలో ఎక్కువగా ఉన్నారట.30 ఏళ్లున్నవారు కూడా వీలునామాలు రాస్తున్నారు అంటే ముందస్తు ఆస్తిపాస్తుల జాగ్రత్తలు ఎంతగా ఉన్నాయో ఊహించవచ్చు. వీలునామాను వ్యక్తి బతికున్నంత కాలం ఎన్నిసార్లు అయినా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో చాలా మంది కరోనా విపత్తు ముగిసేవరకు తాత్కాలిక వీలునామాలు రాస్తున్నారు.

వీలునామా అంటే ఏంటీ?
సాధారణంగా ఒక వ్యక్తి తన స్వార్జితంతో కూడబెట్టిన ఆస్తులను తన వారసులకు లేదా సంస్థలకు లేదా ప్రభుత్వానికి ఎంత వాటా ఇవ్వాలో ముందస్తుగా రాసిపెట్టే చట్టబద్ధం చేసే పత్రాన్ని వీలునామా అంటారు. విల్లు రాసే వ్యక్తిని ‘టేస్టేటర్‌’ అని అంటారు. టేస్టేటర్‌ తన ఆస్తులు, అప్పులు, చెల్లింపులు.. ఇలా దేనినీ వదిలేయకుండా అన్నింటిని వివరంగా పేపర్ లో రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే వీలునామా రాసి ఉంటే..దాన్ని రద్దు చేసుకుని కొత్తది రాసుకోవచ్చు..

వారసులు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వాటా ఇవ్వొద్దని భావిస్తే ఎందుకు ఇవ్వకూడదని అనుకుంటున్నారో వీలునామాలు వివరంగా పొందుపరిస్తే మంచిది. చివరగా వీలునామాను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రిజిస్టర్‌ చేయిస్తే చట్టబద్ధత ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.