Rain : దంచికొట్టిన వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం

Telangana Rain : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో సాయంత్రం వర్షం కురిసింది.

Rain : దంచికొట్టిన వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం

Rain Alert

Updated On : May 20, 2023 / 11:15 PM IST

Telangana Rain : ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఓవైపు ఉక్కపోత, మరోవైపు వడగాల్పులు.. దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ లో సూర్యుడు మంటలు పుట్టిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మండుతున్న ఎండల నుంచి కాస్త రిలీఫ్ లభించింది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో సాయంత్రం వర్షం కురిసింది. తెలంగాణలో నాగర్ కర్నూల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడింది.

Also Read..climate update: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!

ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిచాయి. పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం కలిగింది. ఖమ్మం నగరంతో పాటు పలు గ్రామాలు చీకట్లో ఉన్నాయి. తల్లాడవైపు వెళ్లే ప్రధాన రహదారిలో వృక్షం కూలడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. జేసీబీ ద్వారా రహదారిపై చెట్లను తొలగించారు.

Also Read..Hot Summer : బీకేర్‌ఫుల్.. మరింత మండిపోనున్న ఎండలు, రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు- ఐఎండీ వార్నింగ్

వైరాలో ఈదురు గాలులతో మోస్తరుగా వర్షం కురుస్తోంది. పినపాక బ్రిడ్జి సమీపంలో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు చెట్ల కొమ్మలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మొత్తంగా ఠారెత్తిస్తున్న ఎండలకు విలవిలలాడుతున్న ప్రజలు వర్షం పడటంతో కాస్త రిలీఫ్ పొందారు. వాతావరణం కాస్త చల్లబడటంతో రిలాక్స్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ ఎండా కాలం ముగుస్తుందా? అనే రేంజ్ లో ఎండలు మండిపోతున్నాయి.

రాష్ట్రంలో రేపటి(మే 21) నుంచి 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. హైదరాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.