Komatireddy Rajgopal Reddy : గజ్వేల్ లో పోటీ చేస్తా.. కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

Komatireddy Rajgopal Reddy : గజ్వేల్ లో పోటీ చేస్తా.. కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: కోమటిరెడ్డి

ready contest on kcr in gajwel says komatireddy rajgopal reddy

Updated On : October 25, 2023 / 6:02 PM IST

komatireddy rajgopal reddy : కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ కి దమ్ముంటే మునుగోడులో పోటీ చేసి గెలవాలని సవాల్ విశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని తాను చెప్పలేదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని చెప్పారు.

తెలంగాణ సమాజానికి మేలు చేసెందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సామాజిక తెలంగాణ సాకారం కావాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలన పోవాలని ప్రజలు భావిస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని, కేసీఆర్ ని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

ఆ నమ్మకంతోనే బీజేపీలో చేరా
“బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడం బాధగా అనిపించింది. తుదిశ్వాస వరకు బీజేపీలో ఉండాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూసి నా ఆలోచనలు మారాయి. కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని మునుగోడు కార్యకర్తలు కోరుతున్నారు. తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబం తప్పా అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. కేసీఆర్ కుటుంబం అంతా కలిసి లక్షల కోట్లు దోచుకుంది. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటారనే నమ్మకంతోనే బీజేపీలో చేరాన”ని కోమటిరెడ్డి అన్నారు.

Also Read: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ.. ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా

మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తా
“తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని, మునుగోడు నుంచి తానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆమెకి రాజకీయాల్లోకి రావాలని లేదు. ఆమె ఎప్పటికీ పోటీ చేయదు. మునుగోడు నుండి నేనే పోటీ చేస్తా. ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తానని నేను చెప్పలేదు. ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజలతోనే ఉంటాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పార్టీ మారినప్పుడు కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. నేను కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయానని అన్నారు. కేసీఆర్ కాంట్రాక్టు ఇస్తా అంటేనే నేను తీసుకోలేదు. పదవుల కోసం అమ్ముడు పోయే రక్తం కాదు నాది. నన్ను కొనగలిగే శక్తి పుట్టలేదు, పుట్టబోదు. మునుగోడు ఉప ఎన్నికల్లో నేను ఓడిపోలేదు. నాకు భయపడి మునుగోడుకి నిధులు కేటాయించార”ని చెప్పారు.