CM Revanth Reddy : రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఎలా జరిగిందంటే.. ముఖ్యమైన విషయాలు ఇవే..

తెలంగాణ నూతన ముఖ్యంమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల హర్షధ్వానాల మధ్య గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఎలా జరిగిందంటే.. ముఖ్యమైన విషయాలు ఇవే..

Congress CM Revanth Reddy

Revanth Reddy Swearing in Ceremony : తెలంగాణ నూతన ముఖ్యంమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల హర్షధ్వానాల మధ్య గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వీరితో పాటు కర్ణాటక సీఎం సిద్ధి రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు పలువురు జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించుకున్నట్లు 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ, తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంకలతో రేవంత్ రెడ్డి బయలు దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయంతో ఎల్బీ స్టేడియంకు చేరుకోవటం కాస్త ఆలస్యమైంది. దీంతో రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంకు చేరుకొనే సరికి సమయం 1.15 గంటలు దాటింది. రేవంత్ రెడ్డి సోనియాగాంధీతో ఓపెన్ టాప్ జీపుపై ఎల్బీ స్టేడియంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రమాణ స్వీకారోత్సవ సభావేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్టేడియంలో నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదిక వద్దకు చేరుకున్నారు. 1.18 గంటల సమయంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. గవర్నర్ కు రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

Also Read : Revanth Reddy : ఆరు గ్యారంటీల ముసాయిదాపైనే తొలి సంతకం

మధ్యాహ్నం 1.21 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. రేవంత్ రెడ్డిచేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ 1.21గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 1.25 గంటలకు మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత వరుసగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 1.46 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు సోనియా వద్దకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కారం చేశారు. కుటుంబ సభ్యులను రాహుల్, ప్రియాంకలకు రేవంత్ పరిచయం చేశారు. ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి, 11 మంది మంత్రులు గవర్నర్ తమిళిసైతో గ్రూప్ ఫొటో దిగారు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసింది.

Also Read : తెలంగాణ సేవకులుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్, కాంగ్రెస్ అగ్రనేతలు సభావేదిక నుంచి వెళ్లిపోయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పై తొలి సంతకం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తూ మరో ఫైలుపై సంతకం చేశారు. ఉద్యోగ నియామక పత్రాన్ని రజనీకి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో స్వయంగా అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మట్లాడుతూ.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైందని, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. ఈ మంత్రి వర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని, ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అబివృద్ధి జరుగుతుందని చెప్పారు. రేపు ఉదయం 10గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.