RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా.. ఇది తాత్కాలికమే అన్న జేఏసీ.. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ..
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు.

RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలం అయ్యాయి. కార్మిక సంఘాల జేఏసీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం కమిటీ వేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన సర్కార్.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, కృష్ణ భాస్కర్, లోకేశ్ ఉన్నారు.
కాగా, సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. సమ్మె వాయిదా తాత్కాలికం మాత్రమే అని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో సమ్మె చేయక తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న..
రవాణ శాఖ మంత్రితో చర్చలు జరిపాం. ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగ భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీలో కొని ఆర్టీసీకి ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం, మంత్రి మీద నమ్మకంతో సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం.