Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39మంది కానిస్టేబుళ్లు సస్పెండ్
మూడు రోజులుగా కానిస్టేబుళ్ల కుటుంబాలు రహదారులపైకొ వచ్చి ధర్నాలు చేయడం, సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనలు చేయడంతో ..

Telangana Police Department
Constables Suspended in Telangana : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనకు దిగిన బెటాలియన్ కానిస్టేబుళ్లపై వేటు వేసింది. మొత్తం 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 311 ప్రకారం వారిపై చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. తెలంగాణలోని 3,4,5,6,12,13,17వ బెటాలియన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ వేటు వేసింది. అయితే, 3, 4, 5 17వ బెటాయలిన్లలో ఆరుగురు చొప్పున.. 6, 12, 13 బెటాలియన్లలో ఐదుగురు చొప్పున కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆందోళనలు ప్రేరేపిస్తూ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్నారని పోలీస్ శాఖ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.
Also Read: ఇది కరెక్ట్ కాదు..!- బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనపై డీజీపీ కీలక ప్రకటన..
మూడు రోజులుగా కానిస్టేబుళ్ల కుటుంబాలు రహదారులపైకి వచ్చి ధర్నాలు చేయడం, సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. సెలవుల విషయంలో ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నప్పటికీ సమస్యలేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీజీపీ జితేందర్ చెప్పినప్పటికీ ఆందోళనలు కొనసాగించడం తగదన్నారు. అవసరమైతే మరింత కఠిన నిర్ణయం ఉంటుందని హెచ్చరించారు. ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.