Nagam Janardhan Reddy : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా

Nagam Janardhan Reddy

Nagam Janardhan Reddy : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా

Nagam Janardhan Reddy Resigns Congress

Updated On : October 29, 2023 / 6:22 PM IST

Nagam Janardhan Reddy Resigns Congress : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు సీనియర్ నేత, మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. రేపు (అక్టోబర్ 30) ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్ధన్ రెడ్డి.. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడికి టికెట్ దక్కడంతో మనస్తాపం చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అయితే, కాంగ్రెస్ పెద్దలు ఠాక్రే, జానారెడ్డి చర్చలు జరిపినా నాగం జనార్ధన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు.

ఒక్కరోజే రెండు బిగ్ షాక్ లు..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ లు తగులుతున్నాయి. నేతలు వరుసగా కాంగ్రెస్ ను వీడుతున్నారు. ఒక్కరోజే ఇద్దరు కీలకమైన నేతలు హస్తం పార్టీకి ఇవాళ గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఉదయమే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిపోయారు. కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. ఇక ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేసేశారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకే దక్కుతుందని నాగం చాలా హోప్స్ పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Also Read : కాంగ్రెస్‌కు షాక్.. అనూహ్యంగా కారు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే

సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే సీన్..
కానీ, ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో నాగం తీవ్ర మనస్తాపం చెందారు. 2018 ఎన్నికల్లో నాగం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంలో.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మళ్లీ అదే సీన్ కనిపించింది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. దాంతో నాగం తీవ్ర మనస్తాపం చెందారు.

ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ను కాపాడి ఓ ఊపు తీసుకొచ్చిన సమయంలో తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు నాగం. దీనిపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో నాగర్ కర్నూల్ టికెట్ ను దామోదర్ రెడ్డి కుమారుడికి కేటాయించారు.

Also Read : కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నారు, అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు కక్కిస్తాం- రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నాగం.. రేపు మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ కు ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ ను వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బలాంటిదే అంటున్నారు.