Swachha Badi Siddipet : దక్షిణ భారతంలోనే రెండోది.. సిద్దిపేటలో స్వచ్ఛ బడి.. ప్రత్యేకతలివే
బడి అనగానే మనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు గుర్తుకొస్తారు. టీచర్లు బోధిస్తుంటే స్టూడెంట్స్ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కానీ, ఆ బడిలో మాత్రం ఇలాంటి చదువులు ఉండవు.

Swachha Badi Siddipet
Swachha Badi Siddipet : బడి అనగానే మనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు గుర్తుకొస్తారు. టీచర్లు బోధిస్తుంటే స్టూడెంట్స్ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కానీ, ఆ బడిలో మాత్రం ఇలాంటి చదువులు ఉండవు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై బోధిస్తారు. అదే స్వచ్చ బడి. సిద్ధిపేటలో రూపుదిద్దుకున్న స్వచ్ఛ బడి అందరిని ఆకర్షిస్తోంది.
స్కూల్ అంటే.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్సు, సోషల్ సబ్జెక్టుల గురించి టీచర్లు పాఠాలు చెబుతారు. కానీ చెత్త సేకరణ, ప్రజారోగ్యం, తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నివారణ, చెత్తతో ఇళ్లలోనే ఎరువు తయారీ చేసే విధానాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సిద్దిపేటలోని స్వచ్ఛబడికి వెళ్లాల్సిందే. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత సిద్దిపేటలోనే ‘స్వచ్ఛబడి’ని ఏర్పాటు చేశారు. త్వరలోనే చెత్త గురించిన పాఠాలు ఇక్కడ చెప్పనున్నారు. ఇక్కడ విద్యార్థులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు బోధన ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం వంటి అంశాలను నేర్పిస్తారు. అలాగే తడి, పొడి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తారు.
నగరంలోని పాత ఎంసీహెచ్(మెటర్నిటీ) ఆస్పత్రిలో అన్ని హంగులతో ఈ బడిని ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారికి ఇక్కడ డిజిటల్ క్లాసుల్లో పాఠాలు బోధించి, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా వివరిస్తారు. వర్షపు నీటి సంరక్షణపై ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తారు. మంత్రి హరీష్ రావు చొరవతో బెంగళూరుకు చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త శాంతి ఈ స్వచ్ఛబడిని పర్యవేక్షిస్తున్నారు.