Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ కీలక ప్రకటన
అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని SIT స్పష్టం చేసిందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Sajjanar Representative Image (Image Credit To Original Source)
- సాక్షులను ప్రభావితం చేయొద్దని హరీశ్ కు ఆదేశాలు
- అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తాం
- తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో హరీశ్ రావుని విచారించామని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు హరీశ్ రావు విచారణకు హాజరయ్యారని వెల్లడించారు. కుమారుడి విమాన ప్రయాణం నేపథ్యంలో విచారణను సిట్ ముందుగానే ముగించిందన్నారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని హరీశ్ రావుకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని SIT స్పష్టం చేసిందన్నారు.
ఈ విచారణ కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించింది మాత్రమే అని సజ్జనార్ తెలిపారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలపై అక్రమ నిఘా ఆరోపణలపై దర్యాప్తు చేశామన్నారు. 10-03-2024 నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతైన విచారణ జరుగుతోందన్నారు. ఇప్పటికే సిట్ ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విచారణ జరిపినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 7 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. హరీశ్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం విచారణకు రావాలని సోమవారం రాత్రి హరీశ్ కు నోటీసులు ఇచ్చింది సిట్. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హరీశ్ విచారణకు వచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హరీశ్ ని విచారించారు. సుదీర్ఘంగా ఈ ఎంక్వైరీ జరగడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు దారితీసింది.
సిట్ విచారణ తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నోటీసులు, విచారణలు బీఆర్ఎస్‌ను భయపెట్టలేవని అన్నారు. రేపు ప్రజా కోర్టులో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకేం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. తాను హోంమంత్రిగా ఎప్పుడైనా పని చేశానా అని అడిగారు. రేవంత్ ప్రభుత్వం దోపిడీలు, కుంభకోణాలు, చీకటి రాజకీయాలను బయటపెడుతున్నామనే తమపై కేసులు పెడుతున్నారని హరీశ్ ఆరోపించారు. అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Also Read: లోపల జరిగింది ఇదే..! సిట్ విచారణ తర్వాత హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్
