సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ..
లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

MLC Kavitha
MLC Kavitha : లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ల పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత బెయిల్ కి అర్హురాలు. ఆమె ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు. రెండు కేసుల్లోనూ చార్జిషీట్లు దాఖలయ్యాయని రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని అన్నారు.
Also Read : Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్..
మొత్తం 493 మంది సాక్షుల విచారణ జరిగింది. మహిళగా కవిత సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందవచ్చునని ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇదే వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కేజ్రివాల్, మనీష్ సిసోదియా పిటిషన్లపై తీర్పు ప్రకారం కవిత బెయిల్ కి అర్హురాలు అని వాదించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోదియా లకు బెయిల్ ఇస్తూ.. ఇదే ధర్మాసనం తీర్పు ఇచ్చిందని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ, సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
Also Read : పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి : మంత్రి సత్యప్రసాద్
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూలై 1న కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆగస్టు 7న బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల లిక్కర్ పాలసీ కేసులో పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, కవితకు కూడా బెయిల్ రావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావించారు. సోమవారం కవిత జైలు నుంచి విడుదలవుతుందని ధీమాతో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యారు.