Telangana Congress: ఛాన్స్ ఇవ్వండి.. చేసి చూపిస్తాం అంటున్న కాంగ్రెస్
కర్ణాటక గెలుపుతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది.

telangana congress promise to fulfill 6 guarantees
Telangana Assembly Elections 2023: హామీలు ఇవ్వడం కాదు.. వాటిని అమలు చేయడంలో తమకు తామే సాటి అంటోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తాము.. తెలంగాణలోనూ అదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా తీసుకుంటామని ప్రకటించారు. తుక్కుగూడ సభా వేదికగా ఇచ్చిన 6 గ్యారెంటీల నుంచి ములుగు విజయభేరి సభ వరకు అన్ని చోట్లా ఇదే తరహాలో ముందుకు సాగుతోంది హస్తం పార్టీ. మొత్తంగా ఛాన్స్ ఇవ్వండి.. చేసి చూపిస్తాం అన్న నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్.. తెలంగాణలో పాగా వేసేందుకు పకడ్బందీగానే ముందుకు సాగుతోంది.
కర్ణాటక గెలుపుతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది. తుక్కుగూడ సభా వేదికగా తెలంగాణకు 6 గ్యారెంటీలను ప్రకటించి.. ప్రజల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాతోనే ఈ హామీలను ప్రకటింపజేసిన హస్తం పార్టీ.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆమెతోనే చెప్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం ద్వారా.. కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలుపుకుంటుందనే సందేశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లారు.
తాజాగా.. ములుగులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలోనూ ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు ఎలాగైతే అమలు చేస్తున్నామో.. తెలంగాణలో కూడా అదే చేసి చూపిస్తామని ప్రకటించారు ప్రియాంకగాంధీ. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారాయన.
ఓవైపు కేసీఆర్ ప్రభుత్వం చేయని పనులను వేలెత్తి చూపుతూనే.. అధికారంలోకి వస్తే తామేం చేస్తామో చెప్పుకొచ్చారు ప్రియాంకగాంధీ. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్న ఆమె.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, యువతకు 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read: త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి.. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడో నేతగా..
ఇదే సమయంలో స్థానికంగా ఉన్న సమస్యలపై ఫోకస్ చేయడం ద్వారా ప్రజల్ని తమవైపు ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు వారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ.. పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో పెరుగుతున్న పోటీ, రేసులో ఆ ఆరుగురు
ఇక దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు, అంబేద్కర్ భరోసా పథకం, ఇందిరమ్మ పథకం కింద స్థలంతో పాటు రూ.6 లక్షల రుణం ఇస్తామన్న ప్రియాంక.. రైతులకు 2 లక్షల రూణమాఫీ చేస్తామని ప్రకటించారు. పంటలకు మద్దతు ధర పెంచడంతో పాటు.. ప్రతి ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు అందజేస్తాన్నారు. మొత్తంగా హామీలు ఇవ్వడం కాదు.. ఇచ్చిన వాటిని నెరవేర్చడంలో తమకు ఎవరూ సాటి రారని చెప్పుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలిద్దరూ.