CM KCR : నేను చావు నోట్లో తల పెడితే వచ్చింది తెలంగాణ, ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలే- విపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలవడం లేదు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే. CM KCR

CM KCR : నేను చావు నోట్లో తల పెడితే వచ్చింది తెలంగాణ, ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలే- విపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR Jadcherla Public Meeting

Updated On : October 18, 2023 / 7:04 PM IST

CM KCR Jadcherla Public Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుస పర్యటనలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. నేను చావు నోట్లో తల పెడితే వచ్చింది తెలంగాణ, ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలే అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఎదురుదాడికి దిగారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఒక ఊరిలో నేను ఏడ్చాను:
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ”మహబూబ్ నగర్ లో ఏ చివరకు వెళ్లినా నేను దుఃఖంతో పోయేది. కళ్ళలో నీళ్ళు వచ్చేవి. మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే ఎంపీగా పోటీ చేయాలని జయశంకర్ సార్ చెప్పారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించాను అనే కీర్తి చిరకాలం ఉంటుంది. నడిగడ్డలో ఒక ఊరిలో ఏడ్చాను. కృష్ణా నది పక్కనే పారుతున్నా గుక్కెడు నీళ్ళు లేవు. ముఖ్యమంత్రుల పర్యటనలు, నాటకాలు చూశాం. మహబూబ్ నగర్ ఎప్పటికీ నా గుండెలో ఉంటుంది.

ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలియడం లేదు?
జూరాల బెత్తెడు ప్రాజెక్ట్. అందులో ఉండేది 9 టీఎంసీలు. రోజుకు 2 టీఎంసీలు తీసుకుంటే మూడు రోజుల్లో ఖాళీ అవుతుంది. శ్రీశైలం వాళ్ల జాగీరా? అందుకే అక్కడి నుంచి తీసుకుందామని చెప్పాం. అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలవడం లేదు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే.

ఇక, కరవు కన్నెత్తి కూడా చూడదు:
తెలంగాణ ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలే. పిడికిలి ఎత్తి పోరాటం చేస్తే, అనేక మందిని బలితీసుకొని బాధలు పెట్టి, నేను అమరణ నిరాహార దీక్ష పట్టి చావు నోట్లో తల పెడితే వచ్చింది తెలంగాణ. ఇదే జిల్లాలో పుట్టిన కాంగ్రెస్ నేతలు కేసులు వేసి అడ్డం పడ్డారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని రిజర్వాయర్లలో నీళ్ళు చూస్తారు. లక్ష 50వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అదే జరిగితే కరవు కన్నెత్తి కూడా చూడదు.

పాలుగారే జిల్లాగా, బంగారు తునకగా మారుతుంది:
పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దే బాధ్యత నాది. పాలమూరు జిల్లా పాలుగారే జిల్లాగా, బంగారు తునకగా మారుతుంది. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. గణపతి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగ ఒకేసారి వస్తే ముస్లిం సోదరులు వాయిదా వేసుకున్నారు. ఇదీ అసలైన గంగా జమునా తహజిబ్. నేను పుట్టించిందే రైతుబంధు పథకం. ప్రపంచంలో ఎక్కడా లేదు. తెలంగాణ ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలే.

Also Read : ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?

కాంగ్రెస్ వస్తే ఖతమే..
రూ.37వేల కోట్ల రైతు రుణాల మాఫీ చేశాం. 10 ఏళ్లలో తెలంగాణ రైతు దేశంలోనే గొప్ప రైతుగా మారుతాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రైతులకు 3గంటల కరెంటు సరిపోదని కడుపుల మాట బయట పెట్టాడు. వాళ్ళు వస్తే కరెంటును కాటా కలుపుతారు. ప్రధాని సొంత రాష్ట్రంలో 24గంటల కరెంట్ లేదు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్. దళితబంధుకు జై భీమ్. కరెంటు కాటా కలుస్తది. అధికారంలోకి రాగానే ఉద్దండపుర్ బాధితుల నష్ట పరిహారం వెంటనే అందిస్తాం” అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Also Read : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!