Telangana Congress : సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత హైకమాండ్‌దే.. సీఎల్పీ భేటీలో నిర్ణయం
ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన వివరాలను ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Revanth Reddy
Telangana Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు స్వీకరించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్ లు హాజరయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. గంటపాటు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేంతా ఏకవాక్య తీర్మానంతో సీఎల్పీ నేతను ఎన్నుకున్నారు.
Also Read : Small Majority : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన నేతలు వీరే
ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంను రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు బలపర్చారు. అనంతరం ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానంకు పంపించారు. కాంగ్రెస్ అధిష్టానం సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సీఎల్పీ సమావేశం అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే కు అప్పగించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతపై అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉండటంతో. ఈ సాయంత్రం రాజ్ భవన్ లో కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ ఏర్పాట్లు చేస్తుంది