ఇళ్లకే పరిమితమైన నేతలను కూడా రోడ్ల మీదకు పరుగులు పెట్టిస్తున్నాడు, చాలా గ్యాప్ తర్వాత కాంగ్రెస్‌కు సరైనోడు వచ్చినట్టేనా?

manickam tagore: చాలా గ్యాప్ తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌కు సరైన ఇంచార్జే వచ్చాడా? అంతా తెలుసుకున్నాకే ఎంట్రీ ఇచ్చాడా? మొదట్లోనే.. అందరి లెక్కలు సరి చేయడం మొదలెట్టేశారా? నామ్ కే వాస్తే ఇంచార్జ్ కాదు.. తన నేమ్ అందరికీ తెలిసేలా చేస్తున్నాడా? ఇళ్లకే పరిమితమైన నేతలను కూడా.. రోడ్ల మీదకు పరుగులు పెట్టిస్తున్నాడా? అసలేం జరుగుతోంది గాంధీభవన్‌లో.. టీకాంగ్రెస్ కొత్త ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌పై వినిపిస్తున్న టాక్ ఏంటి?
కొత్త ఇంచార్జ్ రాకతో కొత్త జోష్:
వరుస ఓటములతో.. తీవ్ర నైరాశ్యంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు.. కొత్త ఇంచార్జ్ రాకతో కొత్త జోష్ వచ్చినట్లే కనిపిస్తోంది. గతంలో చాలామంది ఇంచార్జ్‌లు వచ్చారు.. వెళ్లారు.. కానీ.. వాళ్ల ప్రభావం కొంతమేరకే కనిపించేది. కానీ.. మాణిక్కం ఠాగూర్ తన మార్క్ కనిపించేలా చేస్తున్నారు. నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం. కానీ.. ఫైనల్‌గా పార్టీ అభిప్రాయం ఒకటే ఉండాలంటున్నారు ఠాగూర్. అతిగా మాట్లాడే నాయకులకు.. వచ్చీ రాగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. గీత దాటితే.. సహించేది లేదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారట.
ఠాగూర్ కు పార్టీ నాయకులు ఫిదా:
ఏఐసీసీ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించడం కంటే ముందే.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ముండే స్టడీ చేసినట్లుగా గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చీ, రావడంతోనే.. పార్టీలో అన్ని స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించి.. తనేం చేయాలనుకుంటున్నారో స్పష్టం చేసేశారట. అంతేకాదు.. మొదటగా చేపట్టిన 3 రోజుల పర్యటనలో.. సమావేశాలన్నీ గాంధీభవన్ వేదికగానే నిర్వహించారు. ఉదయం నుంచి.. రాత్రి వరకు గాంధీభవన్ గడప దాటకుండా రివ్యూలు చేయడంతో.. పార్టీ నాయకులు ఫిదా అయిపోయారట. సమీక్షా సమావేశాల్లో.. నాయకులంతా ఇళ్లలో కూర్చుంటే కుదరదు.. జనం మధ్యలో ఉండాలంటూ గట్టిగా చెప్పేశారట.
సోనియా పంపిస్తే వచ్చాను, నా మాటే ఫైనల్:
ఇక.. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో వీహెచ్ తనను తాను పరిచయం చేసుకుంటూ.. తనకు సోనియాగాంధీతో ఉన్న పరిచయం గురించి చెప్పబోయారట. వెంటనే మాణిక్కం ఠాగూర్ కల్పించుకుని.. తాను.. వాళ్లు పంపిస్తే వచ్చిన వ్యక్తినేనని.. ఇక్కడ తన మాటే ఫైనల్ అంటూ గట్టిగా చెప్పేశారట. దీంతో.. మీటింగ్‌లో ఉన్న మిగతా లీడర్లు సైలెంట్ అయిపోయారట. టీపీసీసీ ఇంచార్జ్‌లంటే.. నేరుగా స్టార్ హోటల్స్‌లో దిగే సంప్రదాయానికి మాణిక్కం ఠాగూర్ చెక్ పెట్టారట. హోటల్ రాజకీయాలు తనకు నచ్చవని.. ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో సేదతీరుతూ.. సమావేశాలను పార్టీ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు.
దుబ్బాకలో గెలుపు కోసం చాణక్య నీతి:
దుబ్బాక బైపోల్‌కు సంబంధించి.. తన రాజకీయ చాణక్య నీతిని చూపిస్తున్నారు ఠాగూర్. ఉపఎన్నికలో పార్టీ గెలుపు కోసం.. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కీలక నేతలను ఇంచార్జ్‌లుగా పెట్టి.. దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, బైపోల్ బరిలోకి దించడం కూడా కొత్త ఇంచార్జ్ ప్లానే అని చెబుతున్నారు.