కరోనాపై పోరుకు 1200మంది స్పెషలిస్టులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణమే నియామకాలు

కరోనాపై పోరుకు 1200మంది స్పెషలిస్టులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణమే నియామకాలు

Updated On : July 12, 2025 / 3:11 PM IST

కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరు చేసేందుకు వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత స్పెషలిస్టు వైద్యులకు తోడుగా మరో 1,200 మంది స్పెషలిస్టులను నియమించనున్నారు. పీజీ మెడికల్‌ డిగ్రీ, మెడికల్‌ డిప్లొమా పరీక్షలు జూలై 13న పూర్తికానున్నాయి. వారి ఫలితాలను వెనువెంటనే ప్రకటించి, మెడికల్‌ పీజీ పూర్తి చేసిన వివిధ స్పెషలిస్టులను ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంట్లుగా నియమిస్తారు.

గాంధీ, కింగ్‌కోఠి, ఉస్మానియా, టిమ్స్‌ ఆసుపత్రుల్లో వైద్య నిపుణుల భర్తీ:
వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 120 మంది జనరల్‌ మెడిసిన్, 170 మంది అనస్థిషియా, 30 మంది పల్మనాలజీ స్పెషలిస్టులున్నారు. వైరస్‌ విజృంభణ సమయంలో వీరు ప్రముఖ పాత్ర పోషిస్తారు. వీరిలో ఎక్కువ మందిని కరోనా సేవలు అందిస్తున్న గాంధీ, కింగ్‌కోఠి, ఉస్మానియా, టిమ్స్‌ ఆసుపత్రుల్లో నియమిస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. వీరితోపాటు జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్స్‌ తదితర విభాగాల స్పెషలిస్టు వైద్యులను కూడా నియమించనున్నారు. ఇక పీజీ మెడికల్‌ డిప్లొమా పూర్తి చేసిన వారిని జిల్లా, ఏరియా, ఆసుపత్రుల్లో, పీజీ మెడికల్‌ స్పెషలిస్టులను బోధనాసుపత్రుల్లో భర్తీ చేస్తారు.

ఇతర సిబ్బంది పైనా ఫోకస్:
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. అదే సమయంలో అందుకు తగ్గట్లుగా ఆసుపత్రుల్లో తగినంత మంది సిబ్బంది ఉండటం లేదు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వస్తున్నారు. వారికి సేవలందించేందుకు తగినంత మంది వైద్య సిబ్బంది కానీ, శానిటేషన్‌ వర్కర్లు కానీ ఉండటం లేదు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో రోజురోజుకు సిబ్బంది సంఖ్య బాగా తగ్గిపోతోంది.

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు:
ఈ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం నాంది పలికింది. కరోనా చికిత్స అందించే ఆసుపత్రులతోపాటు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, శానిటేషన్‌ వర్కర్స్ ను అవసరాలకు తగినట్లుగా తక్షణమే నియమించుకునే అధికారాన్ని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అప్పగించారు. నిబంధనల ప్రకారం భర్తీ ప్రక్రియ చేపట్టాలంటే చాలా సమయం పడుతోంది. దానికి తోడు కరోనా విధులంటే చాలా మంది ముందుకు రావడం లేదు. అందుకే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తరహాలో అర్హతలున్న వారిని తక్షణమే నియమించుకునే వెసులుబాటును సూపరింటెండెట్లకు కల్పించనున్నారు.