రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ టెస్టులు, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 02:49 PM IST
రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ టెస్టులు, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated On : August 19, 2020 / 3:38 PM IST

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సమాజంలో ఎంతమేర వైరస్‌ వ్యాప్తి చెందిందో అంచనాకు రావడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. యాంటిబాడీస్‌ సరిపడేంతగా వృద్ధి చెందినట్లుగా గుర్తిస్తే.. వారు ప్లాస్మా దానానికి కూడా అర్హులవుతారు. తద్వారా ప్లాస్మాథెరపీతో ఎక్కువమంది ప్రాణాలు కాపాడడానికి అవకాశాలు ఉంటాయి.



సామాజికవ్యాప్తిని గుర్తించి వైరస్‌ను కట్టడి చేయడానికి అవకాశం:
కొందరిలో వైరస్‌ సోకిన తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిండచం లేదు. అంతేకాదు దానంతటదే తగ్గిపోతుంది. ఇలా తెలియకుండానే వైరస్‌ సోకిన వారెంతమంది ఉన్నారనేది యాంటిబాడీస్‌ పరీక్షల్లో తెలుసుకోవడానికి వీలుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా సామాజికవ్యాప్తిని గుర్తించి.. వైరస్‌ను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్దఎత్తున యాంటిబాడీస్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే 25 వేల కిట్లను కొనుగోలు చేసిందని.. సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి చెప్పారు.



యాంటిబాడీస్‌ అంటే:
కరోనా శరీరంలోకి ప్రవేశించాక క్రమేణా వృద్ధి చెందుతుంటుంది. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి సామర్థ్యాన్ని బట్టి తగ్గిపోతుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ను యాంటిజెన్‌ అంటారు. ఆ వైరస్‌ను ఎదుర్కోవడానికి మన శరీరం స్పందిస్తుంది. దీన్ని ‘యాంటిబాడీస్‌’ అంటారు. ఈ యాంటిబాడీస్‌ రెండు రకాలు..
1.ఐజీఎం (ఇమ్యునోగ్లోబులిన్స్‌-ఎం)
2.ఐజీజీ (ఇమ్యునోగ్లోబులిన్స్‌-జీ).



వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తొలి 7 రోజుల వరకూ యాంటిబాడీస్‌ ఉండవు. ఆ తర్వాత మొదట ఐజీఎం తయారవుతాయి. పరీక్షల్లో ఐజీఎం పాజిటివ్‌ ఉంటే.. తాజాగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డట్లుగా అర్థం. ఇవి 7-21 రోజుల వరకూ శరీరంలో ఉంటాయి. ఆ తర్వాత ఐజీజీగా రూపాంతరం చెందుతాయి. ఐజీజీలు కూడా సాధారణంగా వైరస్‌ శరీరంలో ప్రవేశించిన 14వ రోజు నుంచి తయారవుతాయి. ఐజీజీ ఉన్నట్లుగా ఫలితాల్లో నిర్ధారిస్తే.. ఆ వ్యక్తికి వైరస్‌ వచ్చి వెళ్లిపోయిందని అర్థం.



యాంటిబాడీస్‌ పరీక్షల్లో తొలుత ఎవరికి ప్రాధాన్యం?
* కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి
* వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి
* పోలీసులు, పాత్రికేయులు, పారిశుద్ధ్య సిబ్బందికి
* తర్వాత దశలవారీగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో