Telangana Inter results: తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఆరోజే.. అధికారిక ప్రకటన వచ్చేసింది
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది.

Telangana Inter Result 2025
Telangana Inter results 2025: తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. కానీ, తెలంగాణలో ఆలస్యానికి కారణం ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది.
తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఈనెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22వ తేదీ ఉదయం 11గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు సంబంధించి ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరిగాయి. 1532 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. 19 కేంద్రాల్లో మార్చి 18వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ ను ప్రారంభించారు. అయితే, ఈసారి వాల్యుయేషన్ చేసిన జవాబు పత్రాలను రీ వాల్యుయేషన్ సైతం నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. తద్వారా ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఫలితాల విడుదల తరువాత ప్రతీయేటా వేలాది మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కు అప్లయ్ చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ బోర్డు జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తిచేసిన తరువాత ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది. పాస్ మార్కులకు దగ్గరలో ఉన్న వారి జవాబు పత్రాలను రీ వాల్యుయేషన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఈనెల 22న ఫలితాలు వెల్లడించిన తరువాత.. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కుసైతం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అవకాశం కల్పించనున్నారు.