చైనా సరిహద్దు ఘర్షణలో చనిపోయిన కల్నల్ ది సూర్యాపేట జిల్లానే

  • Published By: venkaiahnaidu ,Published On : June 16, 2020 / 12:24 PM IST
చైనా సరిహద్దు  ఘర్షణలో చనిపోయిన కల్నల్ ది సూర్యాపేట జిల్లానే

Updated On : June 16, 2020 / 12:24 PM IST

మంగళవారం ఉదయం లడఖ్ లోని గాల్వ‌న్ వ్యాలీలో భారత్‌-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం  తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో  ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. 

14వేల  అడుగుల ఎత్తున ఈ  రెండు అన్వాయుధ దేశాల సైనికులు కర్రలతో,రాళ్లతో తలపడ్డారు. కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో  కల్నల్ తో పాటు, ఇద్దరు భారతీయ  సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే  ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సంతోష్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యాపేట లోని జవాన్ కుటుంబ  సభ్యులకు సమాచారం వచ్చింది.  

బీహారు 16వ బెటాలియన్లో సంతోష్ పని చేస్తున్నాడని సమాచారం. సంవత్సరం నుంచి చైనా సరిహద్దు లో పనిచేస్తున్న సంతోష్ కు మూడు నెలల క్రితమే హైదరాబాద్ బదిలీ అయింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చైనా సరిహద్దు లోనే ఉండి పోయిన సంతోష్ ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

కల్నల్  సంతోష్ మరణం ఫై అయన తల్లిని స్పందించారు. తన కుమారుడు పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోవడం భాదగా ఉందని, అయితే దేశం కోసం తన కొడుకు చనిపోవడం ఆనందంగా  ఉందని ఉబికివచ్చే  కన్నీళ్లతో  ఆ మాతృమూరి అన్నారు.  

మరోవైపు,గాల్వాన్ వ్యాలీలో జ‌రిగిన తాజా ఘ‌ర్ష‌ణ‌లో..ఐదుగురు చైనా సైనికులు కూడా మృతి చెందారు. 11 మంది చైనా సైనికులు  గాయపడ్డారని చైనా  మౌత్ పీస్  ది గ్లోబల్ టైమ్స్ సీనియర్ రిపోర్టర్ ట్వీట్ చేశారు. సైనిక ఘ‌ర్ష‌ణ‌పై చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఫ్రంట్‌లైన్ ద‌ళాలు త‌మ భూభాగంలోకి రాకూడ‌దంటూ చైనా విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌త బ‌ల‌గాలే ముందుగా హ‌ద్దుమీరిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జావో లిజియ‌న్ ఆరోపించారు. భార‌త సైన్యం దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌న్నారు. దాని వ‌ల్లే రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు జావో తెలిపారు. భార‌త్ త‌మ బ‌ల‌గాల‌ను హ‌ద్దుల్లో పెట్టుకోవాల‌ని, ఏకాభిప్రాయానికి త‌గిన‌ట్లు ఉండాల‌ని జావో సూచించారు.