హైదరాబాద్‌లో కొంపముంచిన వజ్రాల వ్యాపారి బర్త్ డే, 20మందికి కరోనా, 150మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల్లో టెన్షన్

  • Published By: naveen ,Published On : July 5, 2020 / 02:56 PM IST
హైదరాబాద్‌లో కొంపముంచిన వజ్రాల వ్యాపారి బర్త్ డే, 20మందికి కరోనా, 150మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల్లో టెన్షన్

Updated On : July 5, 2020 / 3:23 PM IST

హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారి బర్త్ డే వేడుకలు కొంపముంచాయి. హిమాయత్ నగర్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి(63) నిర్వహించిన బర్త్ డే పార్టీలో నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 20మందికిపైగా కరోనా సోకింది. రెండు రోజుల క్రితం పార్టీ నిర్వహించిన వ్యాపారితో పాటు పార్టీకి హాజరైన మరొక వ్యాపారి కరోనాతో చనిపోయారు. ఈ వేడుకల్లో సుమారు 150మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు పాల్గొన్నారు. ఈ పార్టీకి, ప్రముఖులకు సంబంధాలు ఉండటంతో విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. 15 రోజుల క్రితం బర్త్ డే వేడుకలు జరగ్గా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్టీ ఇచ్చిన వ్యాపారి కరోనాతో చనిపోవడం, 20మందికి కొవిడ్ నిర్ధారణ కావడంతో వేడుకలు హాజరైన రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది.


కరోనాతో గేమ్స్ వద్దు:
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం అనేక నిబంధనలు, ఆంక్షలు విధించింది. పార్టీలు, వేడుకలు, ఫంక్షన్లకు పర్మిషన్ లేదు. ఒకవేళ చేసుకోవాలని అనుకున్నా అధికారుల అనుమతి తీసుకుని పరిమిత సంఖ్యలో గెస్టులను ఆహ్వానించాలి. కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు పాటిస్తూ వేడుకలు చేసుకోవాలి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి, మాస్కులు ధరించాలి. ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుని మరీ చెబుతోంది. అయినా కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ కరోనాతో గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనికి తాజా నిదర్శనమే హిమాయత్ నగర్ లో జరిగిన వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీ. ఫలితంగా కరోనాతో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన వ్యాపారి, పార్టీకి హాజరైన మరొకరు చనిపోయారు. వేడుకలకు హాజరైన వారిలో 20మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. ఇంకా ఎంతమంది కరోనా బారినపడ్డారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.