Telangana Movement 1948 : హింస, వెట్టిచాకిరి అణచివేత నుంచి పుట్టిన చైతన్యం .. తెలంగాణ సాయుధ పోరాటం..

రజాకార్ల ఆగడాలు, అకృత్యాలు మితిమీరిపోవడం, అప్పటికే.. తీవ్రమైన అణచివేతకు గురవడంతో.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వెట్టి చాకిరీపై పల్లెల్లో విప్లవం రాజుకుంది. తెలంగాణ మొత్తం.. రజాకార్ వ్యవస్థపై కన్నెర్ర జేసింది. ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో.. నాగలి ఎత్తాల్సిన చేతులు.. బందూకులెత్తాయ్. ప్రతి ఊరు, ప్రతి పల్లె.. చేతికి దొరికిన ఆయుధం పట్టుకొని.. సాయుధ పోరాటంలోకి దూకింది.

Telangana Movement 1948 : హింస, వెట్టిచాకిరి అణచివేత నుంచి పుట్టిన చైతన్యం .. తెలంగాణ సాయుధ పోరాటం..

Telangana Movement 1948

Updated On : September 17, 2022 / 11:07 AM IST

Telangana Movement : రజాకార్ల ఆగడాలు, అకృత్యాలు మితిమీరిపోవడం, అప్పటికే.. తీవ్రమైన అణచివేతకు గురవడంతో.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వెట్టి చాకిరీపై పల్లెల్లో విప్లవం రాజుకుంది. తెలంగాణ మొత్తం.. రజాకార్ వ్యవస్థపై కన్నెర్ర జేసింది. ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో.. నాగలి ఎత్తాల్సిన చేతులు.. బందూకులెత్తాయ్. ప్రతి ఊరు, ప్రతి పల్లె.. చేతికి దొరికిన ఆయుధం పట్టుకొని.. సాయుధ పోరాటంలోకి దూకింది. అలా.. కొన్ని ఊళ్లకు.. వీర గాథలున్నాయ్.

రాజనేవాడు ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని పాలించాలి. జనానికి కష్టం రాకుండా చూసుకోవాలి. కానీ… ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన నిజాం నవాబ్ పునాదులు.. జాగీర్దార్లు, దొరలపైనే ఆధారపడి ఉండేవి. నిజాం ప్రభువు, రజాకార్ల అండ చూసుకొని.. పల్లెల్లో దొరలు గడీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించుకొని.. వాళ్ల కష్టాన్ని దోచుకు తిన్నారు. వీటన్నింటినీ ఏనాడూ పట్టించుకోలేదు నిజాం. చివరకు సహనం నశించి.. భూమి కోసం, భుక్తి కోసం, దొరల ఆగడాల నుంచి విముక్తి కోసం.. సాయుధులై పోరాటంలోకి దూకారు జనం. బాంచెన్ అంటూ బతికిన బడుగు జీవులు.. నిప్పు కణికలై విప్లవ శంఖం పూరించారు. రణ నినాదమై.. నిజాం నిరంకుశాన్ని ఎదిరించారు. గోల్కొండ ఖిల్లీ కింద నీకు ఘోరీ కడతాం కొడుకో.. నైజాము సర్కరోడా అంటూ జనం నినందించారంటే.. ఎంతగా కడుపు మండిందో అర్థం చేసుకోవచ్చు..

సాయుధ రైతాంగ పోరాటంలో.. వరంగల్ జిల్లా బైరాన్‌పల్లికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1946లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో.. గ్రామ రక్షక దళం ఏర్పాటైంది. నిజాం సర్కారుకు పన్నులు కట్టడం మానేశారు. దీంతో.. 1948 మేలో 60 మంది రజాకార్లు బైరాన్‌పల్లిలో తుపాకులతో దాడులకు ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మందితో దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. అప్పుడు.. గ్రామస్తుల దాడిలో 20 మంది రజాకార్లు చనిపోయారు. అప్పుడు తోకముడిచిన ఖాసిం రిజ్వీ సేన.. మళ్లీ అదను చూసుకుని దొంగదెబ్బ తీసింది. 1948 ఆగస్ట్ 27న.. తెల్లవారుజామున 1200 మంది నిజాం పోలీసులు, రజాకార్లు.. గ్రామాన్ని చుట్టుముట్టారు. ఆ రోజు వాళ్లు చేసిన ఘోరాలు.. జలియన్‌ వాలా బాగ్‌ దారుణానికి ఏమాత్రం తక్కువ కాదు. 88 మందిని నాలుగు వరుసల్లో నిలిపి ఉంచి.. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా అందరినీ.. తుపాకులతో కాల్చి చంపేశారు. ఆ రోజు మొత్తం 118 మంది ప్రాణాలను బలిగొన్నారు. మహిళలను వివస్త్రలను చేసి.. చనిపోయిన వారి శరీరాల చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందాన్ని పొందారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. తిరుగుబాటు చేసిన కూటిగల్ వాసుల్లో.. 20 మందిని ఊచకోత కోశారు.

నిజాం అండతో చెలరేగిన రజాకార్లు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి గ్రామంలోనూ మారణహోమం సృష్టించారు. మీరు చూస్తున్న ఈ మసీదు సాక్షిగా.. వందలాది మందిని ఊచకోత కోశారు. ఖాసీం రజ్వీ అనుచరుడైన మక్బూల్.. 50 మందితో దళాన్ని ఏర్పాటు చేసుకొని.. గుండ్రాంపల్లి ప్రాంతంలో దోపిడీలు, దౌర్జన్యాలు చేసేవాడు. మహిళలపై అత్యాచారాలకు లెక్కే లేదు. దీంతో.. మక్బూల్ ఆగడాలపై.. సాయుధ దళాలు తిరగబడ్డాయ్. దీంతో.. కమ్యూనిస్ట్ దళ సభ్యులు, ఇతర ప్రజలను 350 మందికి పైగా ఊచకోత కోసి మసీదు పక్కన ఉన్న బావిలో పడేసి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడని.. ఆనాటి సమరయోధులు చెబుతున్నారు. నాటి అమరులను స్మరించుకుంటూ.. గుండ్రాంపల్లిలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు.

జనగాం జిల్లా కడవెండి గ్రామం.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో కీలకమైనది. 1946 జులై 4న కడవెండిలోని విస్నూర్ దొరకు చెందిన గడీపై.. దొడ్డి కొమురయ్య, ఇతర సభ్యులతో కలిసి దండయాత్రకు బయల్దేరాడు. దొరసానికి, దొరకు వ్యతిరేకంగా నినదిస్తూ.. గడీ వైపు దూసుకెళ్లారు. ఆంధ్రమహాసభ నాయకుడిగా దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమురయ్య ముందు వరుసలో ఉన్నారు. విస్నూర్ దొర గూండాలు.. తుపాకులతో చేసిన దాడిలో.. దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. తాడిత, పీడిత ప్రజల కోసం రగల్ జెండానెత్తిన వీరుడు దొడ్డి కొమురయ్య. దొరల పెత్తందారీ వ్యవస్థపై తిరగబడి.. విప్లవాగ్నిని రగిలించి.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడయ్యాడు. దీంతో.. ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. సాయుధ పోరాటం కడవెండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి పాకింది.

నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో.. నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఉద్యమానికి ఊపిరిలూదిన.. నా తెలంగాణ, కోటి రతనాల వీణ అనే గేయం పురుడు పోసుకుంది ఇందూరు గడ్డ మీదే. ఆంధ్ర మహాసభలో చురుగ్గా పాల్గొంటున్న కవి దాశరథి కృష్ణమాచార్యులతో పాటు మరో 150 మందిని నిజాం పోలీసులు అరెస్ట్ జిల్లాలోని ఖిల్లా జైలుకు పంపారు. జైలులోని గదులు సరిపోక.. వరండాల్లో, స్నానాల గదుల్లో ఉద్యమకారులను నిర్బంధించారు. ఈ జైలు గోడల మీదే.. బొగ్గుతో దాశరథి అనేక స్ఫూర్తి గీతాలు రాశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని.. గార్ల, బయ్యారం, ఇల్లెందు ప్రాంతాల్లో నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయ్. దీంతో.. రజాకార్ల తూటాలకు 50 మంది దాకా బలయ్యారు. వారి మృతదేహాలను గ్రామాల్లో ఊరేగించి.. పైశాచికానందం పొందారు. మధిర నియోజకవర్గంలో ప్రతి ఊరు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. మధిర పక్కనుండే అల్లీనగరం గ్రామస్తులు.. రజాకార్లను తరిమి తరిమి కొట్టారు. తర్వాత.. మరింత సేనలతో వచ్చి.. ఇళ్లు తగలబెట్టి.. గ్రామంలో విధ్వంసం సృష్టించారు. గోవిందపురంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గ్రామ‌ గ్రామాన సాగింది. రజాకార్ల అరాచకాలతో చితికిపోయిన బతుకులన్నీ.. బందూకులు పట్టి ముందుకు కదిలాయ్. పలుగు, పార, కారం, రోకలి, బరిసెలు.. ఇలా ఏది దొరికితే అది పట్టుకొని.. ఆడా, మగా అనే తేడా లేకుండా.. అంతా సాయుధులై ముందుకు కదిలారు. నిజాం రజాకార్లను తరిమికొట్టేందుకు.. ఉద్యమ దళాలై ఉరిమారు. నిజాం పోలీసులకు, రజాకార్లకు చెమటలు పట్టించారు. కమ్యూనిస్ట్ నాయకులిచ్చిన పిలుపుతో.. 10 వేల మంది గెరిల్లా దళ సభ్యులుగా, లక్ష మందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరారు. ప్రతి ఊరు ఓ విప్లవ కేంద్రమైంది. ప్రతి వ్యక్తి.. ఓ సైనికుడయ్యాడు. ఇదే సమయంలో.. వెయ్యి గ్రామాలపై పట్టు సాధించి.. పది లక్షల ఎకరాలు పేదలకు పంచేశారు. పరిస్థితి పూర్తిగా చేజారేలా కనిపించడంతో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంపై సైనిక చర్యకు ఆదేశించింది. భారత బలగాలు నలువైపుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించి.. నిజాం సైన్యాన్ని తరిమికొట్టాయి. చివరకు నిజాం ఓటమిని అంగీకరించిన లొంగిపోవడంతో.. రజాకార్ల అరాచకాలకు తెరపడింది.