రెండో విడత పంచాయతీ పోరు.. లక్ అంటే వీళ్లది భయ్యా.. భలే గెలిచారు.. అధికార పార్టీ హవా..

Telangana Panchayat Election Results : రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులకు

రెండో విడత పంచాయతీ పోరు.. లక్ అంటే వీళ్లది భయ్యా.. భలే గెలిచారు.. అధికార పార్టీ హవా..

Telangana Panchayat Election Results

Updated On : December 15, 2025 / 9:10 AM IST

Telangana Panchayat Election Results : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోరుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,333 సర్పంచ్ స్థానాలకు, 38, 350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండో దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆధిపత్యాన్ని కనబర్చాయి.

Also Read : ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ, బీసీలకు రాయితీ.. ఏపీలో సూర్యఘర్ యోజన పథకానికి అప్లై చేసుకోండిలా.. స్టెప్ బై స్టెప్

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో టాస్ ద్వారా సర్పంచ్ విజేతలను అధికారులు ఎంపిక చేశారు. కొన్ని పంచాయతీల్లో పోస్టల్ బ్యాలెట్‌తో విజయం సాధించారు. ఒక్క ఓటుతో సర్పంచ్‌గా విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. పలు గ్రామాల్లో మామపై కోడలు విక్టరీ, అత్తపై కోడలు విక్టరీ సాధించారు. ఓ పంచాయతీలో సూసైడ్ చేసుకున్న అభ్యర్థి విజయం సాధించాడు.

వీళ్లకు లక్ కలిసొచ్చింది..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలు పంచాయతీల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో టాస్ ద్వారా అధికారులు విజేతలను ప్రకటించారు. దీంతో ఓటమి చెందిన అభ్యర్థులు, వర్గీయులు తీవ్ర నిరాశకు గురవ్వగా.. విజేతలు సంబరాల్లో మునిగితేలారు. మెదక్, హనుమకొండ, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని పలు పంచాయతీల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లా మెదక్ మండలం చీపురు దుబ్బుతండా పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా 182 ఓట్లు వచ్చాయి. దీంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీయగా.. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థిని విజయం వరించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవిలింగాలలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 483 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి సర్పంచ్ విజేతను నిర్ణయించారు. మరోవైపు.. హనుకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ స్థానంలో ఇద్దరికీ 162 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి విజేతను ప్రకటించారు. వికారాబాద్ మండలం జైదుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ ద్వారా విజేతలను ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబడితండా(కె), కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం వీర్‌వెల్లి గ్రామం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ పంచాయతీలోనూ మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ ద్వారా అధికారులు విజేతలను ప్రకటించారు.

రాష్ట్రంలోని పలు పంచాయతీల్లో ఒక్క ఓటులో తేడాతో విజేతలుగా నిలిచారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ సర్పంచ్ స్థానంకు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల సర్పంచ్‌గా నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటుతో ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం ధన్‌సింగ్ తండాలో ఒక్క ఓటుతో ధనావత్ ధూప్‌సింగ్ ఒక్క ఓటుతో విజయంతో సాధించాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామంలో, వరంగల్ జిల్లా సంగెం మండలం అశాలపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానాలకు ఒక్క ఓటుతో విజయం సాధించారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో తాళ్లపల్లి రాధిక మామయ్య (భర్త తండ్రి) సత్యనారాయణ పై గెలుపొంది. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ఘన్ శ్యామ్ దాస్ (జీడీ) నగర్ గ్రామంలో అత్తపై కోడలు విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీసాడ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా చాల్కి రాజు పోటీ చేశాడు. అయితే, ఓటమి భయంతో ఈనెల 8న ఆత్మహత్య చేసుకోగా.. ఆదివారం జరిగిన ఎన్నికల్లో తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఇలా రెండో విడత పంచాయతీల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్ హవా..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మొదటి విడతలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.. రెండో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజేతలుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,297 స్థానాల్లో, బీఆర్ఎస్ మద్దతుదారులు 1,191 స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 257 స్థానాల్లో ఇతరులు 578 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా విజయం సాధించారు.

Telangana Panchayat Election Second Phase Results

Telangana Panchayat Election Second Phase Results