జోగులాంబ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు టెన్షన్, రెండు నియోజకవర్గాలపై జెడ్పీ చైర్ పర్సన్ అటెన్షన్

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 05:46 PM IST
జోగులాంబ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు టెన్షన్, రెండు నియోజకవర్గాలపై జెడ్పీ చైర్ పర్సన్ అటెన్షన్

Updated On : November 4, 2020 / 6:26 PM IST

tension for two mlas in jogulamba district: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ రాజకీయాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం.. విభిన్న సంస్కృతులు, ఆచారాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడి నేతలకు పట్టింపులు సైతం అదే స్థాయిలో ఉంటాయి. జిల్లాల విభజన తర్వాత నడిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా గుర్తించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ జోగులాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలో రెండు నియోజకవర్గాలకు 2018 ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు చెందిన నేతలే విజయం సాధించారు.

టీఆర్ఎస్‌ లో విభేదాలు:
ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు. గద్వాల నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ అబ్రహం ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మొదట్లో అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయట. కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక అత్యంత కీలకంగా మారింది.

అందరిని ఆశ్చర్యపరుస్తూ సరిత పేరు ఖరారు:
ఇద్దరు ఎమ్మెల్యేలు తమ వర్గానికి చెందిన వారినే జడ్పీ చైర్మన్‌గా నియమించాలని పార్టీ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో అధిష్టానం జోక్యం చేసుకొని తాము ఎవరిని ఖరారు చేస్తే వారే జడ్పీ చైర్మన్‌గా ఉంటారని తేల్చి చెప్పడంతో వారిద్దరూ అధిష్టానం నిర్ణయానికి గౌరవం ఇచ్చారు. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నిక అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు నుంచి గెలుపొందిన జడ్పీటీసీ సభ్యురాలు సరిత పేరును అధిష్టానం ఖరారు చేసింది.

అంతు చిక్కని నడిగడ్డ రాజకీయం:
పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సరితకు నడిగడ్డ రాజకీయాలు ఏ మాత్రం అంతు చిక్కలేదట. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ పర్యటించినా తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట్లో గద్వాల నియోజకవర్గంలో పాగా వేయాలని, రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో విస్తృతంగా పర్యటించారు సరిత. బీసీ సామాజికవర్గానికి బలమైన ఓటు బ్యాంక్‌ ఉండడంతో ఇక్కడే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట.

ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రకటన:
స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం సరితతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా తమ వర్గాన్ని మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయని అంటున్నారు. ఫ్లెక్సీల వివాదం నుంచి మొదలుకొంటే అధికారుల బదిలీల వరకు ఈ ఇద్దరు నేతల మధ్య వైరం పెరుగుతూనే వచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారు. తర్వాత కొద్ది కాలానికి పార్టీ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. అధిష్టానం జోక్యం చేసుకొని ఎవరి పని వారు చేసుకోవాలని సూచించడంతో ప్రెస్ మీట్లు పెట్టి తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవంటూ చెప్పుకొచ్చారు.

సొంత నియోజకవర్గం కావడంతో కొత్త ప్లాన్స్‌:
మరోపక్క అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో పాటు తన సొంత నియోజకవర్గం కావడంతో కొత్త ప్లాన్స్‌ వేశారట సరిత. అక్కడ పార్టీని కాపాడుకుంటే భవిష్యత్‌లో పనికి వస్తుందని విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టారని కార్యకర్తలు చెబుతున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ తీరుతో ఎమ్మెల్యే అబ్రహం కూడా అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో దసరా ఉత్సవాల సందర్భంగా జోగులాంబ అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో మొదటగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత సరిత పర్సనల్‌గా మరోసారి పట్టు వస్త్రాలు సమర్పించారని చెబుతున్నారు.

మొదట అబ్రహం, తర్వాత సరిత.. చేప పిల్లలు వదిలారు
సరిత తీరుతో ఆలయ సిబ్బంది, అధికారులు, పార్టీ కేడర్ అవాక్కయ్యారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం తరఫున రెండుసార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరో వైపు చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం కూడా ఇదే తీరుగా సాగిందంటున్నారు. మొదట అబ్రహం చేప పిల్లలు విడుదల చేయగా.. ఆ తర్వాత మరోసారి జడ్పీ చైర్‌పర్సన్ సరిత చేప పిల్లలు విడుదల చేయడంతో పార్టీలో వర్గపోరు రచ్చకెక్కినట్టు అయ్యిందని అంటున్నారు.

ఏదో ఒక నియోజకవర్గంలో చక్రం తిప్పాలని సరిత కసరత్తు:
ప్రస్తుతం జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఏ నియోజకవర్గంలో పర్యటించినా హాట్ టాపిక్‌గా మారుతోంది. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానానికి దగ్గరవుతూ ఏదో ఒక నియోజకవర్గంలో చక్రం తిప్పాలని సరిత తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఓ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో గద్వాల నియోజకవర్గంపైనే దృష్టి పెట్టి అక్కడే ఉంటూ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో సరిత వ్యవహార శైలి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారడమే కాదు.. స్వపక్షంలోనే విపక్షం ఉన్నట్టుగా అనిపిస్తోందని అంటున్నారు. మరి టీ విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.