Cabinet reshuffle: ఆ లోపే మంత్రివర్గ విస్తరణ.. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు వీరే..
ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. ఇది ఏడాదిగా ఒడవని ముచ్చటగా మారిపోయింది. సంవత్సర కాలంగా రేపోమాపో క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్ అంటూ వాయిదా పడుతూ వస్తున్న విస్తరణ..ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో డెవలప్ మెంట్స్‌ను బట్టి చూస్తే మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన..అదే సమయంలో పార్టీలో మార్పులు, చేర్పుల నేపథ్యంలో క్యాబినెట్‌లో మిలిగిన ఆరు బెర్తులను ఫిలప్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పుపై ఒక అంచనాకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది.? ఏయే వర్గాలకు అవకాశం కల్పించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉంది. అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేసి ఫుల్ క్యాబినెట్‌తో అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. అందుకోసం ఆయన అధిష్టానం నుంచి అనుమతి పొందారని టాక్.
ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఆయనకే..
ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో ఎస్సీ సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. ముఖ్యమైన శాఖలకు కూడా మంత్రులు లేకపోవడంతో పరిపాలనపై కూడా ప్రభావం పడుతోంది. ప్రధానంగా విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలకు మంత్రులు లేరు.
దీంతో ఆయా శాఖల పనిభారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డిపై పడుతోంది. అందుకే ఆ మంత్రిత్వ శాఖలను భర్తీ చేసేందుకు మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో పెండింగ్‌లో పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు రాహుల్‌తో భేటీ తర్వాత లైన్ క్లియర్ అయిందన్న టాక్ నడుస్తోంది.
Also Read: చేరికలపై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు.. టైమ్ చూసి మరీ వైసీపీ నుంచి..
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో పడుతూ వస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. అలా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పుడు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు.
అలాగే మంత్రివర్గంలోకి తీసుకుంటామని కొందరు ముఖ్యనేతలకు ఇచ్చిన హామీ ప్రకారం..సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కింద పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో జరిపిన చర్చల నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కొలిక్కి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అన్ని సమీకరణాలతో పాటు పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవులు ఆశిస్తున్నవారు వీరే..
మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, బీర్ల ఐలయ్య… కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్… ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు… హైదరాబాద్ నుంచి శ్రీగణేష్, దానం నాగేందర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక నిజామాబాద్ నుంచి మదన్‌మోహన్‌రావు, సుదర్శన్ రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్‌లతో పాటు ముదిరాజ్ సామాజికవర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో అమీర్ ఆలీఖాన్, షబ్బీర్ అలీలు క్యాబినెట్ బెర్తు కోసం ఆశపడుతున్నారు. ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా రియాక్టు అవుతుండటంతో.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు ఆమాత్యయోగం లేనట్లేనని తెలుస్తోంది.
అటు రాహుల్ గాంధీ కూడా వలస నేతలను క్యాబినెట్‌లోకి తీసుకునే విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపనట్లు తెలుస్తోంది. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి.. అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి ఫస్ట్ వీక్‌లో క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఈ సారి మంత్రివర్గ పక్కానా.? ఎవరెవరి అవకాశం దక్కుతుందనేది చూడాలి మరి.