TGS RTC : టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ బస్టాండ్‌ల రూపురేఖలు మారబోతున్నాయ్.. షాపింగ్ మాల్స్ తరహాలో..

TGS RTC : తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బస్టాండ్‌లలో అన్ని రకాల వ్యాపారాలకు అనుమతులు..

TGS RTC : టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ బస్టాండ్‌ల రూపురేఖలు మారబోతున్నాయ్.. షాపింగ్ మాల్స్ తరహాలో..

TGS RTC

Updated On : October 5, 2025 / 8:02 AM IST

TGS RTC : తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బస్టాండ్లను షాపింగ్‌మాల్స్ మాదిరిగా మార్చేందుకు చర్యలు ప్రారంభించింది. బస్టాండ్‌లలో ప్రయాణికులకు అవసరమయ్యే అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి ఇటీవల ఎంజీబీఎస్, జేబీఎస్‌లో క్షేత్ర పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. వాటి రూపురేఖలను సమూలంగా మార్చాలని, కొత్త ప్రయోగానికి తెరతీయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌సహా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధాన బస్టాండ్లు ఉన్నాయి. ఆయా బస్టాండ్లలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, స్వీట్ షాప్, సర్వీస్ సెంటర్లు.. ఇలా ఏ తరహా వ్యాపారమైనా చేసుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read: Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. మళ్లీ కుండపోత వర్షాలు వచ్చేస్తున్నాయ్..

ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో షాపింగ్ చేసుకునేలా, ఊర్లకు వెళ్లేవారు వారికి కావాల్సిన వస్తువులను బస్టాండ్లలోనే కొనేలా వాటి రూపురేఖలను మార్చాలని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. కమర్సియల్ స్పేస్‌ను కొత్తగా లీజుకు తీసుకునేవారికి ఏ వ్యాపారమైనా చేసుకునే వెసులుబాటు కల్పించాలని, ఇప్పటికే ఒప్పందంలో ఉన్నవారికిసైతం నచ్చినట్లుగా మార్చుకునే అవకాశం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

ఇదిలాఉంటే.. బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. పండుగ వేళ రూ.110 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈసారి 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది. అయితే, ఆశించిన మేర ప్రయాణికులు లేకపోవడంతో 5,300 వరకు మాత్రమే ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

గతేడాది ఇదే సీజన్లో 6300 ప్రత్యేక బస్సులు నడపగా.. రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈనెల 5,6వ తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఆర్టీసీ ఆదాయం మరింత పెరగనుంది.

మరోవైపు.. టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ లోని ప్రయాణికులకు బిగ్ షాకిచ్చింది. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు చేశారు. బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఛార్జీల పెంపు చేశారు. మొదటి 3 స్టేజ్‌లకు 5 రూపాయలు, 4వ స్టేజ్ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలని వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ కి 5 రూపాయలు.. రెండో స్టేజ్ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 6నుంచి అమల్లోకి వస్తాయి.