Kite Festival : ప్రాణాలు తీస్తున్న పతంగుల పండుగ.. హైదరాబాద్‌లో పలువురు మృతి

పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. ఆనందం నిండాల్సిన చోట విషాదం అలుముకోవచ్చు.

Kite Festival : ప్రాణాలు తీస్తున్న పతంగుల పండుగ.. హైదరాబాద్‌లో పలువురు మృతి

Tragedy In Kite Festival

Updated On : January 14, 2024 / 7:36 PM IST

Kite Festival : సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించే పతంగుల పండుగ ప్రాణాలు తీస్తోంది. సరదాగా, ఆనందంగా జరుపుకోవాల్సిన కైట్ ఫెస్టివల్ కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ లో పతంగుల కారణంగా పలువురు మృతి చెందారు.

బిల్డింగ్స్ పైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేస్తూ పలువురు యువత ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా గాలిపటాలు ఎగురవేస్తూ ముత్యువాత పడ్డారు. అత్తాపూర్ లో తనిష్క్, నాగోల్ లో శివ ప్రసన్న, పేట్ బషీరాబాద్ లో ఆకాష్ చనిపోయిన వారిలో ఉన్నారు.

ఇక, పతంగుల మాంజా వైర్ చుట్టుకొని లంగర్ హౌస్ లో ఆర్మీ జవాన్ కోటేశ్వర రెడ్డి మరణించారు. మాంజా వైర్ మెడకు చుట్టుకోవడంతో ఆయన గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రోడ్డు, చెట్లు, కరెంట్ స్థంభాలపై ఎక్కడపడితే అక్కడ ప్రమాదకరంగా మాంజా వేలాడుతూ కనిపిస్తోంది. కాగా, పతంగుల మాంజాను ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. పిల్లలు, యువత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కైట్స్ ఎగురవేసేందుకు పోటీ పడతారు. రంగు రంగుల గాలిపటాలతో నింగి అంతా బహుళవర్ణం సంతరించుకుంటుంది. రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. అయితే, సంక్రాంతి పండుగ మన ఇళ్లల్లో కాంతులు నింపాలి. విషాదాన్ని కాదనేది మర్చిపోవద్దు. పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. ఆనందం నిండాల్సిన చోట విషాదం అలుముకోవచ్చు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. 3 నుంచి 5 రోజులు కైట్స్ ఎగురవేస్తారు. అయితే, ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. పతంగులు ఎగురవేసే చిన్నారులు, యువకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

పతంగులను ఎగురవేసేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజాను ఉపయోగించి పతంగులను ఎగురవేయరాదు.
* విద్యుత్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉండే చోట పతంగులను ఎగురవేసే సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
* పెద్దపెద్ద భవనాలు, కొండ ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయకపోవడమే మంచిది.
* పతంగులు ఎగురవేసేటప్పుడు చిన్నారులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
* మైదాన ప్రాంతాల్లో మాత్రమే పతంగులను ఎగురవేయాలి.

* పతంగులు డాబాలపై ఎగురవేయవద్దు.
* చుట్టూగోడలు లేని ఇళ్లపై అసలే వద్దు.
* రద్దీ ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం.
* ఎత్తైన ప్రదేశాల్లో పతంగులు ఎగురవేయొద్దు.
* పతంగులకు ఉపయోగించే దారం మాంజా సీసం, వివిధ రకాల కెమికల్స్‌తో తయారు చేయడంతో అవి చాకులా కోసుకునే అవకాశాలు ఎక్కువ.

* దారం తెగి విద్యుత్‌ తీగలకు, చెట్టుకొమ్మలకు చుట్టుకున్నప్పుడు వాటిని తీయొద్దు.
* ఖాళీ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులను ఎగురవేయడం చాలా మంచిది.