TRS State Committee: టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ నేడే..

దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

TRS State Committee: టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ నేడే..

Trs State Committee

Updated On : August 24, 2021 / 7:02 AM IST

TRS State Committee: దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు స్టేట్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కానుంది.

గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై:
2021 ఫిబ్రవరి ఏడో తేదీన జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సభ్యత్వ నమోదును మార్చి నెలాఖరు నాటికి, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్లీనరీ ఉంటుందని ప్రకటించారు. కానీ కోవిడ్‌ రెండో దశ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాప్యం జరిగింది.

సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతూనే ఉండగా… నెలాఖరులోగా పూర్తిచేసి, పుస్తకాలను తెలంగాణ భవన్‌లో అందజేయాలని పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వ నమోదు దాదాపు కొలిక్కి రావడంతో సంస్థాగత కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు షెడ్యూల్‌ తేదీలను మంగళవారం జరిగే సమావేశంలో కేసీఆర్‌ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తుంది. కమిటీలన్నింటినీ ప్రక్షాళన చేయాలని.. వివిధ కారణాలతో అధికార పదవులు దక్కనివారు, చురుకైన నేతలు, కార్యకర్తలతో సామాజిక సమతూకం పాటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

దళితబందుపై కార్యాచరణ:
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకం ఉద్దేశాలు, లక్ష్యాలను పార్టీ యంత్రాంగం ద్వారా బలంగా ఫీల్డ్ లెవల్ లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయాల్లో విపక్షాల దూకుడు, కొత్త రాజకీయ శక్తుల ప్రభావంపైనా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది. జిల్లాల్లో ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి, ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తదితర అంశాలపైనా కేసీఆర్‌ స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నారు.