పేదల ఇళ్లపై సీఎం రేవంత్ కన్ను పడింది- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముందు చేయాల్సిన పని.. ఇళ్లను కూలగొట్టడం కాదన్నారు కిషన్ రెడ్డి.

పేదల ఇళ్లపై సీఎం రేవంత్ కన్ను పడింది- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy Slams Cm Revanth (Photo Credit : Google)

Updated On : November 17, 2024 / 9:12 PM IST

Kishan Reddy : మూసీ ప్రక్షాళనపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డ్రైనేజీ నీళ్లను మూసీలో కలవకుండా చేస్తేనే ప్రక్షాళన సాధ్యమవుతుందని ఆయన తేల్చి చెప్పారు. డ్రైనేజీ సంగతి తేల్చకుండా పేదల ఇళ్లు కూల్చడం దేనికి అంటూ రేవంత్ సర్కార్ ను నిలదీశారు. పేదలు నివాసం ఉంటున్న ఇళ్లపై సీఎం రేవంత్ కన్ను పడిందని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారని మండిపడ్డారు. పేదల జోలికి వెళ్లకుండా మూసీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ కు సూచించారు కిషన్ రెడ్డి.

” పేదల ఇళ్లపై సీఎం రేవంత్ కన్ను పడింది. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాలుష్యం రాకుండా ఆపాలి. నగరంలోని డ్రైనేజీ నీరంతా మూసీలో కలుస్తోంది. మొత్తం కంపెనీలు వదులుతున్న మురుగు నీరంతా మూసీలో కలుస్తోంది. మా ఇంటి నుంచి కూడా డ్రైనేజీ ఇక్కడే కలుస్తోంది. దాని సంగతి ఏంటి? ఆ సంగతి తేల్చకుండా మూసీ బాగుపడదు. దానికి మీరు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. ముందు చేయాల్సిన పని.. ఇళ్లను కూలగొట్టడం కాదు. ముందుగా చేయాల్సిన పని.. మూసీలో కలుస్తున్న కాలుష్య పదార్ధాలు, కాలుష్యమైన నీరు, డ్రైనేజీ నీళ్లు, ఇండస్ట్రియల్ పొల్యూటడ్ వాటర్ మూసీకి రాకుండా ఆపాలి” అని కిషన్ రెడ్డి అన్నారు.

కాగా.. ఒకసారి మూసీ బస్తీలో నిద్ర చేస్తే.. అక్కడ పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి అంటూ.. ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించిన బీజేపీ నేతలు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేశారు. మూసీ నది వెంట 20 ప్రాంతాల్లో 20 మంది నేతలు బస్తీ నిద్ర చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోల్నాక డివిజన్ లోని తులసీరామ్ నగర్ బస్తీలో రాత్రి నిద్ర చేశారు. తులసీరామ్ నగర్ కు వచ్చిన కిషన్ రెడ్డి స్థానికులతో మాట్లాడారు. రచ్చబండ నిర్వహించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక రాత్రి అయ్యాక స్థానికంగా ఉండే శంకరమ్మ ఇంట్లో కిషన్ రెడ్డి బస్తీ నిద్ర చేశారు. అక్కడ భోజనం కూడా చేశారు.

ఓల్డ్ మలక్ పేట్ లో ఎంపీ లక్ష్మణ్, రాజేంద్రనగర్ లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, చైతన్యపురిలో ఎంపీ ఈటల రాజేందర్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బస్తీ నిద్ర చేశారు. అయితే, మూసీ పునరుద్దరణకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. నదిని ప్రస్తుతం ఉన్న విధంగానే ఉంచి, రిటైనింగ్ గోడలు కట్టి పనులు చేసుకోవాలని రేవంత్ సర్కార్ కు సూచించారు బీజేపీ నేతలు.

మూసీ నిద్రలో ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా?- మంత్రి శ్రీధర్ బాబు
మరోవైపు బీజేపీ నేతల మూసీ నిద్రపై మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారని ఆయన విమర్శించారు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలంటే ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని ప్రశ్నించారు. మూసీ నిద్ర చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికైనా ఆ ప్రాంత వాసుల సమస్య తెలిసి రావచ్చన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయనే బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. బీజేపీ ప్రజాప్రతినిధులకు బాధ్యత లేదా అని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్ బాబు.