MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధం.. ఓటుహక్కు నమోదుకు అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది.

MLC Election
Telangana : తెలంగాణలో వచ్చేఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని సమాచారం. ఇందుకోసం పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఎన్నిక రాబోతుంది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే, పల్లా ఖమ్మం- వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తన ఎమ్మెల్సీ పదవికి ఇటీవల రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 2024 జూన్ 8లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహనకు ప్రక్రియను మొదలు పెట్టింది.
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందిచే ప్రక్రియకు శ్రీకారం చుడుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఓట్ల జాబితాకు నోటీసు జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీకంటే ముందు పట్టభద్రులుగాఉన్నవారు ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత ఫిబ్రవరి 21న ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధంచేసి ఫిబ్రవరి 24వ తేదీన ప్రచురిస్తారు. 24 నుంచి మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్చి 29న వాటిని పరిష్కరించి, ఏప్రిల్ 4వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది.