Hydra: అప్పట్లో హడావిడి చేసి.. ఇప్పుడెందుకు సైలెంట్ అయినట్లు?

అనేక అంశాల్లో హైడ్రా లక్ష్యం ఏంటో ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది.

Hydra: అప్పట్లో హడావిడి చేసి.. ఇప్పుడెందుకు సైలెంట్ అయినట్లు?

Updated On : March 20, 2025 / 8:44 PM IST

హడలెత్తించింది.. కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రారంభించిన నెల, రెండు నెలలు వరకు హైడ్రా చేసిన హల్‌చల్‌ అంతాఇంతా కాదు. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు హైడ్రా సైలెంట్‌ అయిందన్న చర్చ జరుగుతోంది. హైడ్రా స్టార్ట్ అయినప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతుందనే విమర్శలు ఉన్నాయి. సినీ హీరో నాగార్జున ఎన్.కన్వెన్షన్‌ నేలమట్టం చేసి పబ్లిక్ దృష్టిని ఆకర్షించింది హైడ్రా. ఆ తర్వాత ఓల్డ్ సిటీలో ఒక ఎమ్మెల్సీ నిర్మాణం కూల్చివేశారు.

దాంతో హైడ్రాకు ఒక్కసారిగా మద్దతు పెరిగింది. ఇక చందానగర్ సర్కిల్..నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్..దుండిగల్ మున్సిపల్ పరిధిలో.. అన్ని అనుతులు ఉన్న నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూకట్‌పల్లి నల్లచెరువు దగ్గరలోని అమీన్‌పూర్‌లో పేదలు, మధ్య తరగతి కుటుంబాలు లోన్లు పెట్టి కొన్న ఇండ్లను కూల్చివేసి హైడ్రా తీవ్ర విమర్శల పాలైంది.

ఒకటి రెండు అంశాల్లో హైడ్రాకు మద్దతు లభించినా..ఆ తర్వాత హైడ్రా తీరుపై వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. ప్రతిపక్ష పార్టీలు హైడ్రా చర్యలను తీవ్రంగా ఖండించాయి. హైడ్రా అధికారుల తీరును మొదట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎండగట్టారు. బీజేపీ ఈటల రాజేందర్ కూడా పేదల ఇళ్లను కూల్చడంపై తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అయితే ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, హైడ్రా ఆఫీస్‌ కూడా బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉంది కూలుస్తారా అంటూ హైడ్రాను నిలదీశారు.

హైడ్రాపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
విమర్శలు వచ్చిన సందర్భాల్లో హైడ్రా స్పందించిన తీరు ఇంకా విమర్శలకు దారి తీసింది. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడంతో హైడ్రాపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దాంతో చెరువులు నాళాల పరిధిలో కట్టిన నిర్మాణాల్లో అప్పటికే పబ్లిక్ ఉంటే వాటిని కూల్చమంటూ చెప్పుకొచ్చారు. చట్టం ప్రకారం తాము ముందుకు వెళ్తామని చెప్పిన హైడ్రా కమిషనర్ ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గారనే దానిపై చాలా డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.

అయితే పేదలను కూల్చివేసిన హైడ్రా అధికారులు..కొన్ని నిర్మాణాలపై ఫిర్యాదలు చేసినా పట్టించుకోకుండా పర్మిషన్లు ఉన్నవాటి జోళికి వెళ్లబోమంటే చెప్పడం విమర్శల పాలు చేసింది. ఆయా సందర్భాల్లో వస్తున్న పొలిటికల్ ప్రెజర్స్ ప్రకారం హైడ్రా పనిచేస్తూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఇక ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుర్‌రెడ్డి హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు చేస్తే ఎకనాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వడం లేదని తాను చేసిన ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఇలా ప్రతిపక్షాలే కాదు అధికార పక్షం కూడా రంగనాథ్ ఆరోపణలు, విమర్శలు ఫేస్ చేస్తున్నారు.

ఇక ప్రజలు ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్‌ దగ్గర నిర్మాణాల కూల్చివేతకు తహశీల్దార్‌కు తాము సహకరించాము అని హైడ్రా కమిషనర్ చెప్పిన వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయింది కోర్టు. చాంద్రాయణగుట్ట తహశీల్దార్‌ అడిగితే హైకోర్టును కూల్చడానికి కూడా సహకరిస్తారా అంటూ హైడ్రాను సూటిగా ప్రశ్నించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏంటంటూ ప్రశ్నించింది. పలు సందర్భాల్లో హైడ్రా అధికారులు నేరుగా కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇలానే వ్యవహరిస్తే జీవో 99 ను రద్దుచేసి హైడ్రాను మూసి వేయడానికి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.

హైడ్రాను నిలదీసిన హైకోర్టు
ఇక లేటెస్ట్‌గా మీరాలం చెరువు దగ్గరలో అక్రమ నిర్మాణంలో మీ నివాసం ఉందని దానిని కూల్చివేయాల్సి ఉందంటూ ఫాతిమా అనే మహిళకు తహశీల్దార్‌ నోటీసులు జారీ చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పేద మధ్యతరగతి వారే మీ టార్గెట్టా అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. ఈ రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అంటూ సందేహం వ్యక్తం చేసింది. మియాపూర్ చెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి అంటూ హైకోర్టు సూటిగా హైడ్రాను ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు అర్థం ఉంటుందని..హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

హైడ్రా చేస్తున్న పనులు చాలా బాగున్నాయి అంటూ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ కొందరు చెబుతుండటం వెనుక హైడ్రా అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంలోనూ హైడ్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు దుర్గం చెరువు మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల ఆక్రమణలు తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఇలా అనేక అంశాల్లో హైడ్రా లక్ష్యం ఏంటో ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. మొదట పబ్లిక్‌ నుంచి రియాక్షన్‌ రాగా వారికి కొందరు లీడర్ల వాయిస్ యాడ్‌ అయింది. ఇప్పుడు ఏకంగా హైకోర్టే హైడ్రా తీరును తప్పుబట్టడం చూస్తుంటే..ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిందన్న చర్చ నడుస్తోంది. కోర్టు ఆగ్రహంతోనైనా హైడ్రా తీరు మారుతుందా.? లేక ఇలాగే వ్యవహరిస్తుందా అనేది చూడాలి మరి.