ఉద్యోగ సంఘాలపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం.. స్పందించిన కేటీఆర్.. ఇలా మాట్లాడితే ఊరుకోబోమంటూ..
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వంపై పోరాడతామంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డ విషయం తెలిసిందే. ఎవరిమీద సమరం చేస్తారంటూ, వచ్చే ఆదాయానికి మించి ఖర్చు చేయలేం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్‌ను ఎన్ని తిట్టినా భరిస్తున్నామని, అయితే, తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని అన్నారు. రేవంత్‌రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన అసమర్థత రుజువైందని చెప్పారు. ఢిల్లీ నుంచి నడిపే ఇటువంటి పార్టీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎన్నికల వేళ చెప్పారని, ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలే నిజమవుతున్నాయని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్‌కు శాపం పెట్టే రేవంత్ రెడ్డి మాట్లాడారని కేటీఆర్ చెప్పారు. ఇటువంటి దారుణమైన మాటలపై కచ్చితంగా మాట్లాడాలని కేసీఆర్ ఆదేశించారని అన్నారు. ఎన్నికల ముందు 420 హామీలతో ఇచ్చిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో మోసం అని తేలిపోయిందని అన్నారు.
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు. తనకు అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని చెప్పారని అన్నారు. ఇంత దివాళ కోరుమాటలను ఏ రాజకీయ నేత మాట్లాడబోరని తెలిపారు. పరిపాలన చేత కావడం లేదని రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని కేటీఆర్ చెప్పారు. నోట్ల కట్టలతో వెళ్లి దొరికిపోయిన దొంగను అందరూ దొంగే అంటారని విమర్శించారు.
మూడేళ్ల క్రితం రాహుల్ గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించి ఎన్నో హామీలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. వాటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదని, అందుకే ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదని అన్నారు.