Telangana cabinet: ఇదేంటిది? తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేకులా? ఏప్రిల్ 3న ఉంటుందా?
మొత్తం మీద తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ ఎపిసోడ్‌ను మించిపోతోంది. ఇదిగో లిస్ట్.. అదిగో ముహూర్తం ఉంటూ ఊరిస్తున్నారు తప్పా.. పదవులు పంచింది లేదు. ప్రమాణస్వీకారం చేయించింది లేదు. క్యాబినెట్ విస్తరణకు క్లైమాక్స్‌లో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి అడ్డుపడుతుంది. మరి ఈసారి విస్తరణకు ఏ సమస్య బ్రేకులు వేస్తుంది. అసలు విస్తరణ విషయంలో రాష్ట్ర ముఖ్యనేతల మనసులో ఏముంది. పార్టీ హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుంది. ఇంతకీ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా. ఉంటే ఛాన్స్ దక్కేదెవరికి?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉగాది తర్వాత అంటూ ఊరించారు. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అంటూ ఊదరగొట్టారు. ఐతే ముహూర్త సమయం సమీపిస్తోన్నా ఆ ఊసే లేదు.. కాంగ్రెస్ నేతల మౌనం చూస్తుంటే విస్తరణ ఏప్రిల్ 3న ఉంటుందా.. ఉండదా అనే డౌట్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో మెయిన్ డిబెట్ పాయింట్‌గా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15నెలలు దాటిపోయింది. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం కొలువైనప్పుడు ఏర్పాటైన మంత్రివర్గమే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు అనే మాట వినిపించింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి.. ఆశావహులు వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు. రోజుకో అప్‌డేట్.. లీకుల మీద లీకులు, జాబితా రెడీ అంటూ గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ. ప్రమాణస్వీకార వేదిక ఇప్పటి వరకు అలంకరణకు నోచుకోలేదు.
ఆశావహుల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు..
మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతున్నా ఆశావహుల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. కొత్త మంత్రుల జాబితా ఫైనల్ అయ్యింది.. హైకమాండ్ ప్రకటించడమే తరువాయి అన్నకున్న టైమ్‌లో సామాజికవర్గాలు ట్విస్ట్ ఇచ్చాయి.. మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఒక్కతాటిపైకి వచ్చి క్యాబినెట్‌లో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు లంబాడ సామాజికవర్గం కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. వీరితో పాటు బీసీ సామాజికవర్గం నుంచి పలువురు నేతలు మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఇలా సామాజికవర్గాల డిమాండ్లతో డైలామాలో పడిన కేంద్రానికి తమ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ రంగారెడ్డి జిల్లా నేతలు మరో బిగ్ ట్విస్ట్ ఇస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ హైకమాండ్‌కు కత్తిమీద సాములా తయారైందని గాంధీభవన్ నుంచి వినిపిస్తున్న టాక్..
ఇలా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చినా.. ఏదో ఒక సమస్య అడ్డుపడుతూ వస్తోంది. దీంతో విస్తరణ ఆలోచన వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈ సారి ఎట్టి పరిస్థితిలో క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యనేతల్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడంతో విస్తరణ తుదిదశకు వచ్చినట్లే అని అనుకున్నారంతా.
సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తుండడంతో ప్రస్తుతం నాలుగు బెర్తులను భర్తీ చేయాలనే ఆలోచనకు వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. మరో రెండు బెర్తులను ఖాళీగా ఉంచాలని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న నాలుగులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిట శ్రీహరి, గడ్డం వివేక్‌కు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందని గాంధీభవన్‌లో వినిపిస్తున్న టాక్. ఈ నలుగురి పేర్లు వినిపిస్తుండడంతో ఇతర సామాజికవర్గాల నేతలు కాస్తు గుర్రుగా ఉన్నారనే టాక్ గాంధీభవన్‌లో వినిపిస్తోంది.
ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేసి తీరాల్సిందేనని..
మంత్రివర్గ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న ఎట్టి పరిస్థితిలో మంత్రివర్గ విస్తరణ చేసి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నారట. తాజాగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో జరిపిన చర్చల్లో మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చిందట. అంత సాఫీగా జరుగుతుందనుకున్న టైమ్‌లో తెలంగాణ బీసీ నేతలు ధర్నా కార్యక్రమం విస్తరణకు అడ్డుపడే అవకాశముంది. ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ నేతల ధర్నా కార్యక్రమం ఉంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలనే డిమాండ్‌తో ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీ వెళ్లి .. ఉదయం నుంచి సాయంత్రం వరకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ ఎలా సాధ్యమన్న ప్రశ్న.. కాంగ్రెస్ ముఖ్యనేతల్ని ఆలోచనలో పడేసిందట.
మొత్తం మీద తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది. వీటన్నింటి దాటుకొని ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. లేదంటే షరామాములే అన్నట్లు మరోసారి వాయిదా పడుతుందా.. అనేది తేలాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.