అన్‌లాక్‌ 3.0 : థియేటర్‌‌లు,జిమ్ లకు అనుమతి!

  • Published By: venkaiahnaidu ,Published On : July 26, 2020 / 03:35 PM IST
అన్‌లాక్‌ 3.0 : థియేటర్‌‌లు,జిమ్ లకు అనుమతి!

Updated On : July 29, 2020 / 9:53 AM IST

కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1‌ నుంచి అమలవనున్న అన్‌లాక్‌ 3.0లో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ప్రకటిస్తారని సమాచారం. .

ఆగస్ట్‌ 1 నుంచి సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భౌతిక దూరం వంటి కఠిన నిబంధనలతో కూడిన నిర్ధిష్ట మార్గదర్శకాలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సినిమా థియేటర్లను అనుమతించే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ హోంమంత్రిత్వ శాఖ ముందుంచింది.


ఈ ప్రతిపాదనకు ముందు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ థియేటర్‌ యజమానులను సంప్రదించగా 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లను అనుమతించాలని కోరారు. అయితే ముందుగా 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూ థియేటర్లను తెరవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.


కరోనా కేసుల తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలను జారీచేయవచ్చని కేంద్రం తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత వంటి కొన్ని నియంత్రణలు అన్‌లాక్‌ 3లోనూ కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. ఈ అంశంపై తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించామని పాఠశాలలను తెరవడంపై వారు సానుకూలంగా లేరని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.