మరో వివాదం : శ్రీవారికి ఉదయమే మధ్యాహ్న నైవేద్యం

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 02:34 AM IST
మరో వివాదం : శ్రీవారికి ఉదయమే మధ్యాహ్న నైవేద్యం

Updated On : March 26, 2019 / 2:34 AM IST

తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్టాల్సి వస్తుందనే అభిప్రాయం వక్తమవుతోంది. ఉదయం నైవేద్యం ఇచ్చాక రాత్రి 8 గంటలకు జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.

తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్‌ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం(మార్చి 24, 2019) ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం(మార్చి 25, 2019) నుంచి అమల్లోకి వస్తాయంది. ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం 7 గంటలకే పూర్తి చేయాలని అర్చకులను ఆదేశించారు. ఈ నిర్ణయంపై అర్చకులు, హిందూ మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహా అపచారం అంటున్నారు.

తిరుమల ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నరకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్‌ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్‌ దర్శనానికి బాగా డిమాండ్‌ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి  మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్‌–1 బ్రేక్‌ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు  మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి.

ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. మధ్యాహ్న నైవేద్యం వేళలో మార్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో డిప్యూటీ ఈవో స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఆగమ సలహా మండలికి సిఫార్సు చేశారు. వారి సలహా వచ్చే వరకు ప్రతి సోమవారం పాత పద్ధతిలోనే మధ్యాహ్న నైవేద్యం నిర్వహిస్తామన్నారు.