చంద్రబాబు పక్కా వ్యూహం: మూడు రాజధానులకు మండలిలో బ్రేక్

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 04:08 PM IST
చంద్రబాబు పక్కా వ్యూహం:  మూడు రాజధానులకు మండలిలో బ్రేక్

Updated On : January 22, 2020 / 4:08 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలను పసిగట్టలేక చివరకు శాసనమండలిలో వైసీపీ వెనుకంజ వెయ్యక తప్పలేదు. అమరావతిపై సాగిన పోరులో చివరకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ఫలించాయి.

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇరు పార్టీల్లోని అతిరథ మహారథులు అందరూ గ్యాలరీలో ఉండగా..  మండలిలో మెజారిటీ టీడీపీ ఎమ్మెల్సీలు ఎప్పటికప్పుడు చంద్రబాబు డైరెక్షన్‌లో వారి వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే చివరకు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించింది.

అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను.. సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో మూడు నెలలు రాజధానుల అంశం పెండింగ్‌లో పడినట్లే. ఈ అంశంపై రోజంతా శాసన మండలిలో ప్రతిష్టంభన ఏర్పడగా.. బిల్లులపై ఓటింగ్ జరపాలని.. అధికారపక్షం.. సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనంటూ ప్రతిపక్షం మండలి చైర్మన్ ముందు తమ వాదనలు వినిపించాయి. ముందుగా రెండు బిల్లులపై చర్చ నిర్వహించారు మండలి చైర్మన్. అందరూ ప్రసంగించిన తర్వాత.. అసలు విషయం తెరపైకి వచ్చింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ముందుగానే తెలుగుదేశం పక్ష నేత యనమల రామకృష్ణుడు నోటీసులు ఇచ్చారు. అయితే.. అవి సాంకేతికంగా మూవ్ కాలేదని.. చైర్మన్ చెప్పారు.

దీంతో మంత్రులు సెలక్ట్ కమిటీకి బిల్లును పంపే అధికారం చైర్మన్‌కు లేదంటూ బిల్లులపై ఓటింగ్ జరపాలని పట్టుబట్టింది అధికార పార్టీ. అయితే ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కార్ వ్యూహం మాత్రం చివరకు విఫలం అయ్యింది. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతోంది. అయితే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వంకు చివరకు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లు అయ్యింది. 
 
మరోవైపు ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై అనర్హత వేటు వేయించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు భిన్నంగా ఓటింగ్ నేపథ్యంలోనే మరింత మంది టీడీపీ సభ్యులను తమ వైపు లాగేయాలని వైసీపీ కిందామీద పడింది. ఇందుకోసం మంత్రులు అత్యధిక సమయం పాటు శాసనమండలిలోనే గడిపారు. దీంతో అక్కడ వాడీవేడి వాతావరణం నెలకొనగా.. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహమే ఫలించింది. 

నిజానికి బిల్లు వోటింగులో వీగిపోతే వెంటనే అసెంబ్లీలో చర్చించి, మళ్లీ మండలికి పంపించాలని అనుకున్నది అధికారపక్షం… కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేదు… ఎందుకంటే…? ఇప్పడు ఆ బిల్లులు రెండూ మండలి పరిశీలనలోనే ఉన్నట్టు లెక్క. సెలెక్ట్ కమిటీ ఏమంటుందో తేలేవరకూ ఏమీ చేయలేరు.