ఏపీ సీఎం ఎవరు : ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 03:35 PM IST
ఏపీ సీఎం ఎవరు : ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్

Updated On : April 18, 2019 / 3:35 PM IST

ఏపీలో పోలింగ్ ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు నెల రోజులకు పైగా గడువుంది. ఇప్పుడు అందరి దృష్టి.. గెలిచేదెవరు? ఓడేదెవరు? అనే దానిపైనే. అభ్యర్థులకు కూడా ఇదే టెన్షన్‌. దీంతో బెట్టింగ్‌ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే వారంతా ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్స్‌తో బిజీ అయిపోయారు. తమ లెక్కలు పక్కా అనే నమ్మకంతో కోట్ల రూపాయలను  కుమ్మరించేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. టీడీపీ, వైసీపీలు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. గెలుపుకోసం అన్ని శక్తులనూ ఒడ్డాయి. మధ్యలో నేనూ పోటీలో ఉన్నానంటూ జనసేన  దూకింది.

ఎన్నికలు ముగిసినా ఫలితాలకు చాలాకాలం ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని పంటర్లు క్యాష్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో, మొబైల్  ఫోన్లతో… కోడ్ భాషలో ఈ పందేలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు బెట్టింగ్ అనేది వందలు, వేలల్లో సాగేది. ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు… చిన్న పందేలు కాయట్లేదు. అంతా లక్షలు, కోట్లలోనే వ్యవహారం  సాగుతోంది.  

ఏ పార్టీకి ఎన్ని సీట్లు…? ఎవరికి ఎంత మెజారిటీ…? ఏ జిల్లాలో ఎవరిది పైచేయి…? పలానా నియోజకవర్గంలో గెలుపెవరిది..? అక్కడ మూడో స్థానంలో నిలిచేదెవరు…? ఇలా ఒకటేమిటి ప్రతి అంశమూ  బెట్టింగ్‌కు పనికివచ్చేదే. సీటును బట్టి రేటు మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే రూ.లక్ష ఇస్తామని, ఓడితే రూ.3 లక్షలు తీసుకుంటామని డీల్ కుదుర్చుకుంటున్నారు. ఏపీలో మంగళగిరి, గుడివాడ,  నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందూపురం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం పార్లమెంట్‌ స్థానాల గెలుపోటముపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, బాలకృష్ణ మెజారిటీలపై కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న అంశంపై బుకీలలో భిన్నాభిప్రాయాలున్నాయి.  కొంతమంది వైసీపీ వస్తుందని అంటున్నారు. మరికొంత మంది టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. కొందరరు పంటర్లు మాత్రం ఏ పార్టీకీ మెజార్టీ రాదని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరివైపు ఉంటారన్నదానిపై  అధికారం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా పందేలు నిర్వహిస్తున్నారు.

అమరావతి ప్రాంతంలో పందెం రాయుళ్లకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. రాజధాని రాకతో భూముల విలువ కోట్లకు పెరగడం.. ల్యాండ్‌ పూలింగ్‌తో ఉన్నపళంగా కోటీశ్వరులుగా మారడంతో కాయ్ రాజ్  కాయ్ అంటున్నారు. ఇల్లు, పొలాలు, నగదు, బంగారం ఇలా ఒకటేమిటి అన్నీ కుదువపెట్టి జూదం మొదలు పెట్టేశారు. రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరు, ఉండవల్లి, పెనుమాకల్లో పందేలు హద్దుల్లేకుండా  సాగుతున్నాయి. టీడీపీకి దక్కేవెన్ని? వైసీపీ నెగ్గేదెన్ని? జనసేన ప్రభావం చూపేదెక్కడ? అంటూ ఎవరి అంచనాలతో వారు పందేలు కాస్తున్నారు. కోట్లాది రూపాయల బెట్టింగ్‌లతో ఐపీఎల్ బెట్టింగ్స్‌ను  మైమరిపించేస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో ప్రధానంగా మంగళగిరి స్థానంపై బెట్టింగ్‌ రాయుళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ బరిలోకి దిగడంతో భారీ ఎత్తున పందెం రాయుళ్లు  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోకేష్‌ గెలుస్తారా లేదా అన్నదానితో పాటు గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్నదానిపై కోట్లలో పందేలు సాగుతున్నాయి. ఫలితాల గడువు దగ్గరపడిన కొద్దీ బెట్టింగ్‌లు మరింత జోరందుకుంటున్నాయి. నిర్వాహకులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు.

నగదు అందుబాటులో లేకుంటే… ఆస్తి పత్రాలను కూడా ష్యూరిటీగా ఉంచవచ్చంటూ పందెం రాయుళ్లను ముగ్గులోకి దించుతున్నారు. ఇరుపక్షాల నుండి డబ్బులు తీసుకుంటున్న నిర్వాహకులు… ఫలితాలు వచ్చాక గెలిచిన వ్యక్తికి ఆ సొమ్మును అందిస్తారు. ఈ తతంగమంతా నిర్వహించినందుకు  పందెం మొత్తంలో ఒకటి నుంచి మూడు శాతం వరకు కమీషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బెట్టింగ్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా… లాభం లేకుండా పోతోంది.